విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం పేరు చెప్పగానే...ముందు గుర్తొచ్చే పేరు టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఇక్కడ అయ్యన్న తిరుగులేని విజయాలు సాధించారు. 1983, 1989, 1994, 1999, 2004, 2014  ఎన్నికల్లో అదిరిపోయే విజయాలు అందుకున్నారు. 1989, 2009 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.  ఇక  గత ఐదేళ్లు చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పని చేసారు.

 

అయితే ఇలా నర్సీపట్నంలో తిరుగులేని నాయకుడుగా ఉన్న అయ్యన్నపాత్రుడుకు, దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు పెట్ల ఉమా శంకర్ గణేష్ చెక్ పెట్టారు. 2014 ఎన్నికల్లోనే శంకర్ స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ఆ ఓటమి నుంచి పాఠం నేర్చుకున్న శంకర్ నియోజకవర్గంలో పనిచేసుకుంటూ, పార్టీని బలోపేతం చేసారు. అయ్యన్న ఫ్యామిలీ వ్యతిరేక విధానాలపై పోరాడారు. ఆ విధంగా పోరాడటంతో శంకర్ 2019 ఎన్నికల్లో దాదాపు 24 వేల మెజారిటీతో విజయం సాధించారు.

 

కాకపోతే ఇక్కడొక ట్విస్ట్ ఏంటంటే శంకర్ రాజకీయ జీవితం మొదలైంది టీడీపీలో అది కూడా అయ్యన్న శిష్యుడుగా. 1995 లో కొత్తపల్లి సర్పంచ్ గా పనిచేసారు. అయితే అయ్యన్న ఫ్యామిలీ ఉండగా నర్సీపట్నంలో ఎదగడం కష్టమని తెల్సుకున్న శంకర్...వైసీపీ పెట్టిన వెంటనే అందులో చేరిపోయారు. ఇక అక్కడ నుంచి కష్టపడి పనిచేసి, ఇప్పుడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

 

తొలిసారి ఎమ్మెల్యే అయిన శంకర్..నియోజకవర్గంలో బాగా కష్టపడుతున్నారు. ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటున్నారు. వారికి కష్టమొస్తే వెంటనే స్పందిస్తున్నారు. ప్రస్తుతం కూడా లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో అయ్యన్న వదిలేసిన  పనులని పూర్తి చేసే పనిలో ఉన్నారు.

 

అటు స్థానిక సంస్థల ఎన్నికల విషయానికొస్తే నర్సీపట్నంలో మెజారిటీ స్థానాలు వైసీపీ ఖాతాలో పడటం ఖాయం. నియోజకవర్గంలో నాతవరం, గొలుగొండ, నర్సీపట్నం, మాకవరపాలెం మండలాలు ఉన్నాయి. ఈ నాలుగు చోట్ల వైసీపీ బలంగానే ఉంది. కాకపోతే నర్సీపట్నం మండలం, నర్సీపట్నం మున్సిపాలిటీలో టీడీపీకి బలం ఉంది. దీంతో అక్కడ వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇస్తుంది.

 

ఇక టీడీపీ విషయానికొస్తే...అయ్యన్న వీక్ అయిపోయారు. దశాబ్దాల పాటు ఎమ్మెల్యేగా ఉన్నాసరే పెద్దగా నియోజకవర్గానికి చేసింది ఏమి లేకపోవడం వల్ల, ఆయనపై నెగిటివ్ ఉంది. ఇదే సమయంలో అయ్యన్నకు అండగా ఉండే ఆయన సోదరుడు సన్యాసిపాత్రుడు వైసీపీలోకి  రావడంతో శంకర్ కు మరింత బలం చేకూరింది. అయితే అయ్యన్న వయసు మీద పడటంతో వచ్చే ఎన్నికల్లో ఆయన తనయుడు విజయ్ పాత్రుడు బరిలో ఉండే అవకాశముంది. కానీ విజయ్...శంకర్ ముందు నిలబడటం కష్టమంటున్నారు. మొత్తానికైతే నర్సీపట్నంలో అయ్యన్నకు..శంకర్ చెక్ పెట్టినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: