అధికార పార్టీ అన్నాక ఆధిపత్య పోరు మామూలుగానే ఉంటుంది. అయితే వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో, ఇతర పార్టీల నేతలు వైసీపీలోకి వచ్చేయడం వల్ల పలు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు ఎక్కువైంది. ఇలా ఆధిపత్య పోరు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో విశాఖపట్నం జిల్లా లోని పాడేరు నియోజకవర్గం కూడా ఒకటి. ఈ నియోజకవర్గంలో వైసీపీకి తిరుగులేని బలం ఉంది.

 

అందుకే 2014 , 2019 ఎన్నికల్లో వరుసగా వైసీపీ జెండా ఎగిరింది. అయితే 2014 లో వైసీపీ తరుపున గెలిచిన గిడ్డి ఈశ్వరి తర్వాత టీడీపీలోకి వెళ్లిపోవడంతో, 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి వైసీపీ నుంచి పోటీ చేసి, టీడీపీ నుంచి పోటీ చేసిన గిడ్డి ఈశ్వరిపై దాదాపు 40 వేలపైనే మెజారిటీతో గెలిచారు.

 

ఇక భారీ మెజారిటీతో గెలిచిన భాగ్యలక్ష్మి నియోజకవర్గంలో నిదానంగా పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో నియోజకవర్గం పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదు. ఇక్కడ ఆసుపత్రిలు పెద్దగా అందుబాటులో లేకపోవడం వల్ల, ప్రజలు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు.

 

అయితే ఇక్కడ వైసీపీలో ఆధిపత్య పోరు ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి బాలరాజు డామినేషన్ బాగానే ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆయన తన కుమార్తెకు సీటు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో భాగ్యలక్ష్మికి కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంది. అలాగే నియోజకవర్గంలో కొన్ని కొన్ని చిన్న గ్రూపులు కూడా ఉన్నాయి.

 

అయితే భాగ్యలక్మి ఏ గ్రూపుని కలుపుకుని వెళ్లలేకపోతున్నారు. అందువల్ల ఆమెకు వచ్చే ఎన్నికల్లో సీటు దక్కడం కష్టమని తెలుస్తోంది. ఇక ఇక్కడ టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. గిడ్డి ఈశ్వరి పార్టీ మారడం వల్ల, అక్కడి ప్రజలు ఆమెని నమ్మే పరిస్థితుల్లో లేరు. పైగా ఇక్కడ టీడీపీకి అంతబలం లేదు. ఈ పరిణామాల వల్ల పాడేరు స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లు వైసీపీనే దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆధిపత్య పోరు ఉన్నాసరే ఇక్కడ వైసీపీకి తిరుగులేదని చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: