విజయనగరం...టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతి రాజు అడ్డా. 1978 నుంచి 1999 వరకు విజయనగరం ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటిన నాయకుడు. 1978లో జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత 1983,1985, 1989, 1994,1999, 2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక్క 2004లోనే ఈయన ఓటమి పాలయ్యారు. అది కూడా ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కోలగట్ల వీరభద్రస్వామి చేతిలో.

 

అయితే 1989 నుంచి అశోక్ గజపతిరాజుకు ప్రత్యర్ధి కోలగట్లనే. కాంగ్రెస్ తరుపున పోటీ చేసి వరుసగా ఓటమి పాలవుతూ వచ్చారు. ఇక 2004లో సీటు రాకపోయేసరికి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికలకొచ్చేసరికి ఆయన వైసీపీ తరుపున పోటీ చేసి టీడీపీ నుంచి పోటీ చేసిన మీసాల గీత చేతిలో ఓటమి పాలయ్యారు.

 

ఇక 2019 ఎన్నికల్లో వీరభద్రస్వామి పుంజుకుని, అశోక్ గజపతిరాజు తనయురాలు అతిథి గజపతిపై విజయం సాధించారు. అటు వైసీపీ కూడా అధికారంలోకి రావడంతో మంచిగానే పనిచేసుకుంటున్నారు. అశోక్ గజపతి రాజు ఫ్యామిలీని వీక్ చేసి, వైసీపీని బలోపేతం చేశారు. అలాగే మంత్రి బొత్స సత్యనారాయణ పెత్తనం జిల్లాలో ఎక్కడైనా సాగుతుందేమో గానీ, విజయనగరం నియోజకవర్గంలో సాగడం చాలా కష్టం. ఇక్కడ కోలగట్ల ఆధిపత్యమే ఎక్కువ.

 

అయితే వయసు మీద పడటంతో కోలగట్ల వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం కష్టం. అందుకనే ఆయన తన కుమార్తెకు సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు. ఇదే సమయంలో అశోక్ గజపతి రాజు అన్న ఆనంద్ గజపతిరాజు కుమార్తె, మాన్సస్ ట్రస్ట్ ఛైర్మన్ సంచయిత గజపతిరాజుకు విజయనగరం సీటు దక్కే అవకాశముందని అంటున్నారు. జగన్ కూడా సంచయిత లాంటి వారికి ఇస్తేనే అశోక్ గజపతి రాజు ఫ్యామిలీకు చెక్ పెట్టగలమని భావిస్తున్నట్లు సమాచారం.

 

అటు చూస్తే అశోక్ గజపతికి వయసు మీద పడటంతో జిల్లాలో టీడీపీని నడిపించే బాధ్యత ఆయన తనయురాలు అతిథి తీసుకున్నారు. అయితే ఆమె అంత యాక్టివ్ గా పనిచేస్తున్నట్లు కనబడటం లేదు. దీంతో అక్కడ టీడీపీ వీక్ గా కనిపిస్తోంది. ఇక ఈ ప్రభావమే స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టంగా కనబడనుంది. విజయనగరం కార్పొరేషన్‌లో వైసీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: