శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం....తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం అంటే 1983 ఎన్నికల నుంచి చూసుకుంటే ఇక్కడ టీడీపీదే పైచేయి. 1983, 1985, 1989, 1994, 1999, 2009, 2014, 2019 ఎన్నికల్లో అంటే 8 సార్లు ఇక్కడ టీడీపీ అభ్యర్ధులదే విజయం. అయితే ఇక్కడ టీడీపీ విజయానికి చెక్ పడింది దివంగత వైఎస్సార్ సమయంలోనే. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నరేశ్ కుమార్ అగర్వాల్ వైఎస్ గాలిలో గెలిచారు.

 

అయితే ఆ తర్వాత కాంగ్రెస్ పని అయిపోయినా, వైసీపీ వచ్చినా సరే టీడీపీకి చెక్ పెట్టడం కుదరలేదు. గత రెండు పర్యాయాలు అంటే 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున బెందాళం అశోక్ వరుసగా గెలిచారు. 2019లో రాష్ట్రమంతా జగన్ గాలి ఉన్నాసరే టీడీపీ విజయానికి బ్రేక్ పడలేదు. ఇక రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన అశోక్...తనకు సాధ్యమైన మేరకు పనిచేసుకుంటూ వెళుతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు.

 

కాకపోతే అశోక్ ఎక్కువగా ప్రజలకు అందుబాటులో లేకుండా విశాఖలో ఉంటున్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ నేత పిరియా సాయిరాజ్ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అలాగే అధికారులతో మాట్లాడి పనులు కూడా చేయించుకోగలుగుతున్నారు. గతంలో ఈయనకు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. టీడీపీ తరుపున 2009 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో ప్రాధాన్యత దక్కక వైసీపీలోకి వచ్చి 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.

 

ఓటమి ఎదురైనా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి టీడీపీ ఎమ్మెల్యే వీక్ కావడం సాయిరాజ్‌కు కలిసొచ్చే అంశం. కానీ ఇచ్చాపురంలో టీడీపీ కేడర్ స్ట్రాంగ్ కాబట్టి చివరి వరకు పోరాడాల్సిన అవసరముంటుంది. అటు స్థానిక సంస్థల ఎన్నికల విషయానికొస్తే....వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి...మెజారిటీ స్థానాలు ఆ పార్టీ ఖాతాలోకే వెళ్ళడం ఖాయం. అలాగే టీడీపీ కూడా కొన్ని చోట్ల బలంగా ఉంది. నియోజకవర్గంలో కంచిలి, ఇచ్చాపురం, కవిటి, సోంపేట మండలాలు ఉన్నాయి. నాలుగు మండలాల్లో వైసీపీకి టీడీపీ గట్టి పోటీనిస్తుంది. మొత్తానికి చూసుకుంటే టీడీపీ కంచుకోటలో వైసీపీకి ఛాన్స్ దక్కేలాగానే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: