కింజరాపు అచ్చెన్నాయుడు....తెలుగుదేశం పార్టీలో అతి ముఖ్యమైన నేతల్లో ఒకరు. అధినేత చంద్రబాబుకు కుడి భుజం లాంటి వారు. దశాబ్దాల కాలం నుంచి శ్రీకాకుళం జిల్లాలో పార్టీ బలోపేతం చేస్తున్న నాయకుడు. తన అన్న ఎర్రన్నాయుడు చనిపోయాక, టీడీపీలో కీలక నేతగా ఎదుగుతూ వచ్చారు. అచ్చెన్న తన అన్నబాటలోనే నడుస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇక తొలిసారిగా 1996 ఉపఎన్నికలో హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

 

ఆ తర్వాత అదే స్థానం నుంచి 1999, 2004 ఎన్నికల్లో గెలిచారు. ఇక నియోజకవర్గాల పునర్విభజన తర్వాత టెక్కలి నియోజకవర్గానికి మారి, 2009 ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ఓడిపోయినా వెనక్కి తగ్గకుండా కష్టపడి అక్కడే పనిచేస్తూ, ప్రజలకు అండగా ఉంటూ వచ్చారు. ఫలితంగా 2014 ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి విజయం సాధించడమే కాకుండా, చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు.

 

ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి...రాష్ట్రమంతా జగన్ గాలి ఉన్నా సరే అచ్చెన్న విజయానికి బ్రేక్ పడలేదు. మళ్ళీ టెక్కలిలో టీడీపీ జెండాని ఎగరవేశారు. అయితే పార్టీ ఘోరంగా ఓడి ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన,అచ్చెన్న మాత్రం నియోజకవర్గంలోనే ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే ఉన్నారు. అటు చంద్రబాబుకు కుడి భుజంగా ఉంటూ, అటు అసెంబ్లీలో గానీ, ఇటు బయటగానీ అధికార వైసీపీకి ధీటుగా కౌంటర్లు ఇస్తున్నారు. చంద్రబాబు ఏ పోరాటానికి పిలుపునిచ్చిన చేయడానికి ముందుంటున్నారు.

 

అయితే అచ్చెన్న టెక్కలి ప్రజలకు పెద్దగా అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది. ఆయన ఎక్కువ శాతం వైజాగ్ లోనే గడుపుతున్నారని సమాచారం. దీంతో టెక్కలిలో వైసీపీ నేత పేరాడ తిలక్ అధికారాన్ని ఉపయోగించుకుని ప్రజలకు అండగా ఉంటున్నారు. ఏ సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించడంలో ముందుంటున్నారు. వచ్చే ఎన్నికల్లోనైనా అచ్చెన్నకు చెక్ పెట్టి వైసీపీ జెండా ఎగరవేయాలనే కసితో పనిచేస్తున్నారు. అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకే మెజారిటీ స్థానాలు దక్కేలా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే టెక్కలిలో అచ్చెన్న పట్టు తగ్గినట్లే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: