తనని నమ్ముకున్నవారికి జగన్ ఎప్పుడు న్యాయం చేస్తారనే విషయం తెలిసిందే. ఎలాంటి పరిస్థితిలోనైనా తనకోసం అండగా నిలబడిన వారికి మంచి పొజిషన్ ఇవ్వడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గరు. అలా మొదట్లో ఓటమి వచ్చినా..తర్వాత ఎమ్మెల్యే సీటు ఇచ్చి రెడ్డి శాంతికి విజయం దక్కేలా చేశారు. 2014 ఎన్నికల్లో రెడ్డి శాంతికి శ్రీకాకుళం పార్లమెంట్ సీటు ఇచ్చారు.  ఆ ఎన్నికల్లో ఆమె కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు.

 

అయితే 2019 ఎన్నికల్లో శాంతికి పాతపట్నం అసెంబ్లీ సీటు ఇచ్చారు. ఇక జగన్ గాలిలో శాంతి 15వేల పైనే మెజారిటీతో టీడీపీ అభ్యర్ది కలమట వెంకట రమణమూర్తిపై విజయం సాధించారు. పైగా వైసీపీ కూడా అధికారంలోకి రావడంతో శాంతి, నియోజకవర్గంలో మంచిగా పనిచేసుకుంటున్నారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కాకపోతే శ్రీకాకుళం వైసీపీలో అందరూ రాష్ట్ర స్థాయి నాయకులే ఉన్నారు.

 

కానీ శాంతికి మాత్రం ఆ ఇమేజ్ రాలేదు. ఆమె లోకల్ వరకు పర్వాలేదనిపిస్తున్నారు. అలా అని ఈ సంవత్సర కాలంలో ఓ గొప్ప ఎమ్మెల్యే అని నిరూపించుకున్న సందర్భం కూడా లేదు. కాకపోతే జగన్ ఇమేజ్‌తోనే ఆమె ఇప్పటికీ నెట్టుకొట్టుకొస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక ఇక్కడ టీడీపీ తరుపున వెంకట రమణమూర్తి ఉన్నారు. ఈయన 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచి, ఆ తర్వాత టీడీపీలోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

 

ఓటమి వచ్చినా కార్యకర్తలకు అండగా ఉంటూ...ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడుతూనే ఉన్నారు. టీడీపీని బలోపేతం చేయడానికి తనవంతు కృషి చేస్తున్నారు. ప్రస్తుతానికి జగన్ గాలి ఇంకా ఉండటంతో, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకే మెజారిటీ స్థానాలు దక్కుతాయి. ఈ నియోజకవర్గంలో మేలియాపుట్టి, ఎల్‌ఎన్ పేట, కొత్తూర్, పాతపట్నం, హీరమండలం మండలాలు ఉన్నాయి. మెజారిటీ మండలాల్లో వైసీపీకి బలం ఉంది. అలా అని టీడీపీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కొన్ని చోట్ల వైసీపీకి గట్టి పోటీనే ఇస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: