శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి గట్టి పట్టున నియోజకవర్గాల్లో ఎచ్చెర్ల ఒకటి. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఆరుసార్లు విజయం సాధించింది. రెండుసార్లు కాంగ్రెస్ గెలిచింది. 1983 నుంచి 1999 ఎన్నికల్లో వరుసగా టీడీపీదే గెలుపు. ఇక 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఇక 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు విజయం సాధించారు. వైసీపీ అభ్యర్ధి గోర్లే కిరణ్ కుమార్‌పై స్వల్ప మెజారిటీ తేడాతో గెలిచారు.

 

అయితే 2019 ఎన్నికలోచ్చేసరికి జగన్ గాలి ముందు కిమిడి నిలబడలేకపోయారు. కిరణ్ కుమార్ చేతిలో 20 వేల మెజారిటీ తేడాతో ఓటమి చవిచూశారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కిరణ్...తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్‌లో మొదలుపెట్టారు. 1992 నుంచి 2013 వరకు ఆ పార్టీలో ఉండి, తర్వాత వైసీపీలోకి వచ్చారు. అలా 2014లో పోటీ చేసి ఓడిపోయి, 2019లో గెలిచారు. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన కిరణ్..ప్రజలకు బాగానే అందుబాటులో ఉంటున్నారు.

 

ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడంలో ముందున్నారు. ఇటీవల కూడా లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తనవంతు సాయం అందిస్తున్నారు. పేదలకు నిత్యావసర వస్తువులు, వలస కార్మికులకు భోజన సదుపాయం కల్పించారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్, కొత్త గ్రామ సచివాలయ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.

 

ఇక ఇక్కడ టీడీపీని కళా వెంకట్రావు నడిపిస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పెద్దగా పుంజుకున్నట్లు కనిపించడం లేదు. పైగా నామమాత్రంగానే ఏపీ అధ్యక్షుడుగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ టీడీపీ వీక్‌గా ఉండటం వల్ల కిరణ్ కుమార్‌ స్ట్రాంగ్ అయ్యారు. అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీకి మెజారిటీ స్థానాలు రావడం ఖాయం. నియోజకవర్గంలో లావేరు, రణస్థలం, జి సిగడం, ఎచ్చెర్ల మండలాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ప్రతి మండలంలోనూ వైసీపీ బలంగానే ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: