ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు మ‌ధ్యలో మంచి మార్కెట్ సెంట‌ర్‌గా ఉన్న నియోజకవర్గం తాడేపల్లిగూడెం. కాపు సామాజికవర్గం ప్రభావం ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటుంది. కాపులే పార్టీ అభ్యర్ధుల గెలుపుని డిసైడ్ చేస్తుంటారు. మొదట్లో ఈ నియోజకవర్గం టీడీపీకి అనుకూలంగా ఉండేది. 1983 నుంచి 1999 వరకు ఆ పార్టీకే విజయాలు దక్కాయి. అయితే 2004లో వైఎస్సార్ గాలి బాగా ఉండటం వల్ల కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కొట్టు సత్యనారాయణ విజయం సాధించారు.

 

అయితే 2009 ఎన్నికలోచ్చేసరికి కాపు పార్టీగా ముద్రవేసుకున్న ప్రజారాజ్యం విజయం సాధించింది. ఇక్కడ కాపులంతా చిరంజీవికి మద్ధతు తెలపడంతో, పి‌ఆర్‌పి నుంచి పోటీ చేసిన ఈలి నాని విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కొట్టు రెండోస్థానంలో నిలవగా, టీడీపీ నుంచి పోటీ చేసిన ముళ్ళపూడి బాపిరాజు మూడోస్థానానికి పరిమితమయ్యారు.

 

2014 ఎన్నికల్లో మాత్రం టీడీపీ-జనసేనలతో కలిసి పొత్తులో పోటీ చేసిన బీజేపీ నేత పైడికొండల మాణిక్యలరావు విజయం సాధించారు. వైసీపీ తరుపున పోటీ చేసి తోట పూర్ణ గోపాల సత్యనారాయణ ఓడిపోయారు. అయితే 2019 ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ తరుపున కొట్టు సత్యనారాయణ రంగంలోకి దిగి సూపర్ విక్టరీ కొట్టారు. టీడీపీ తరుపున ఈలి నాని, జనసేన తరుపున బొలిశెట్టి సత్యనారాయణలు పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

 

అయితే ఈసారి కాపులంతా వైసీపీకి మద్ధతు తెలపడంతో కొట్టు విజయం సాధ్యమైంది. ఒకవేళ టీడీపీ-జనసేనలు కలిసి పోటీ చేసి ఉంటే వైసీపీకి విజయం దక్కేది కాదు. కానీ ఆ రెండు సెపరేట్‌గా పోటీ చేయడంతోనే కొట్టు విజయం సాధించగలిగారు. ఇక రెండోసారి విజయం దక్కించుకున్న కొట్టు...నియోజకవర్గంలో దూకుడుగానే పనిచేస్తున్నారు. ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. కాకపోతే ప్రభుత్వ పథకాలు బాగానే అందుతున్న, అభివృద్ధి మాత్రం పెద్దగా జరగలేదు.

 

ఇక ఇక్కడ టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన ఈలి నాని యాక్టివ్ గా లేరు. ఈయన ఎక్కువగా వైసీపీ నేతలతో ఎక్కువ టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీని ముళ్ళపూడి బాపిరాజు నడిపిస్తున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటూ...పార్టీని బలోపేతం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. అయితే ఎన్నికలై సంవత్సరం దాటిన టీడీపీ పెద్దగా పుంజుకోలేదు. దీంతో లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో వైసీపీదే పైచేయి కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: