నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఎంత బలం ఉందనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. 2014 ఎన్నికల్లోనే జిల్లాలో ఉన్న 10 సీట్లలో వైసీపీ 7 గెలుచుకుని సత్తా చాటింది. ఇక 2019 ఎన్నికలకు వచ్చేసరికి పరిస్తితి పూర్తిగా వైసీపీకి అనుకూలంగా మారిపోయింది. మొత్తం సీట్లు వైసీపీ ఖాతాలోనే పడిపోయాయి. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన సీట్లలో కూడా వైసీపీ జెండా ఎగిరింది. అలా 2014 ఎన్నికల్లో ఓడిపోయిన ఉదయగిరి నియోజకవర్గం కూడా ఇప్పుడు వైసీపీనే గెలిచింది.

 

మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దాదాపు 35 వేల మెజారిటీతో టీడీపీ అభ్యర్ధి బొల్లినేని వెంకట రామారావుని ఓడించారు. అయితే చంద్రశేఖర్ 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున విజయం సాధించారు. తర్వాత ఆయన సోదరుడు మేకపాటి రాజమోహన్ రెడ్డితో కలిసి వైసీపీలోకి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో 2012 ఉపఎన్నికలు వచ్చాయి. ఆ ఉపఎన్నికల్లో ఉదయగిరి నుంచి గెలిచారు.

 

అయితే 2014 ఎన్నికల్లో మేకపాటి...టీడీపీ అభ్యర్ధి బొల్లినేని రామారావు చేతిలో ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల్లోమాత్రం మేకపాటి అద్భుత విజయం సాధించారు. నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచిన మేకపాటి...తనదైన శైలిలో పనిచేసుకుంటూ వెళుతున్నారు. కాకపోతే మరీ ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నట్లు మాత్రం కనిపించడం లేదు. ఈ ఏడాది సమయంలో పెద్దగా అభివృద్ధి జరిగిన దాఖలాలు కూడా లేవు. ప్రభుత్వ పథకాలు మాత్రం యథావిధిగా అందుతున్నాయి.

 

అటు టీడీపీ నేత బొల్లినేని రామారావు కూడా పెద్దగా పుంజుకోలేదు. ఇంకా ఇక్కడ టీడీపీ వీక్ గానే కనిపిస్తోంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకే మంచి విజయావకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యే మేకపాటి కాస్త సైలెంట్‌గా ఉన్నా, వైసీపీ కేడర్ మాత్రం యాక్టివ్ గానే పనిచేస్తోంది. మొత్తానికైతే ఇక్కడ ఎమ్మెల్యే పెద్దగా చేసేది ఏమి లేకపోయినా సరే...వైసీపీ మాత్రం వీక్ కాలేదు. ఇప్పటికీ పార్టీ బలంగానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: