హిందూపురం నియోజకవర్గం....ఈ పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చే పేరు నందమూరి తారకరామారావు. తెలుగుదేశం పార్టీ స్థాపించి వెంటనే 1983లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్...కొన్ని పరిస్థితుల నేపథ్యంలో 1985లో మళ్ళీ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ హిందూపురంలో బరిలో నిలబడి అదిరిపోయే విజయం సాధించి...మళ్ళీ సీఎం పీఠం ఎక్కేశారు.

 

తర్వాత 1989, 1994 ఎన్నికల్లో కూడా ఎన్టీఆర్ ఇక్కడ నుంచే పోటీ చేసి గెలిచారు. ఆయన మరణం తర్వాత వచ్చిన 1996 ఉపఎన్నికలో ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ పోటీ చేసి గెలిచారు. ఇక తర్వాత 1999, 2004,2009 ఎన్నికల్లో కూడా ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్ధులే విజయం సాధించారు. ఇక 2014 ఎన్నికలకొచ్చేసరికి ఎన్టీఆర్ మరో తనయుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం బరిలో దిగి విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

 

పైగా టీడీపీ కూడా అధికారంలోకి రావడంతో హిందూపురంలో ఏళ్ల తరబడి ఉన్న సమస్యలకు బాలయ్య చెక్ పెట్టారు. నియోజకవర్గానికి పెద్దగా అందుబాటులో లేకపోయిన పీఏ ద్వారా పనులన్నీ చక్కబెట్టేవారు. ముఖ్యంగా హిందూపురం ప్రజలు ఎక్కువ ఇబ్బందిపడే త్రాగునీటి సమస్యని పరిష్కరించారు. కాకపోతే అక్కడక్కడ మాత్రం ఇంకా త్రాగునీటి సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా నియోజకవర్గంలో పలురకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆ ఐదేళ్లు లేపాక్షి ఉత్సవాలు ఘనంగా చేశారు.

 

అయితే బాలయ్య పనులు బాగానే చేసినా...తన నోటిదురుసు కాస్త ఇబ్బంది అయింది. హిందూపురంలో సొంత అభిమానులునే తిట్టి, కొట్టిన సందర్భాలు ఉన్నాయి. దీంతో బాలయ్య మీద కాస్త నెగిటివ్ వచ్చింది. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో బాలయ్య ఓడిపోతారని అంతా అనుకున్నారు. పైగా రాష్ట్రమంతా జగన్ గాలి ఉండటంతో సొంత పార్టీ వాళ్లే బాలయ్య గెలుపు కష్టమని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ముందు కంటే ఎక్కువ మెజారిటీతోనే బాలయ్య రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

 

వైసీపీ అభ్యర్ధి మహమ్మద్ ఇక్బాల్‌పై 17 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఇక రెండోసారి గెలిచిన బాలయ్య...ప్రజలకు అందుబాటులో లేకపోయినా సరే పనులు చేయిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి రాకుండా చూసుకుంటున్నారు. ఇటీవలే కోవిడ్ నేపథ్యంలో హిందూపురం హాస్పిటల్‌కు తన సొంత ఖర్చుతో వెంటిలేటర్స్, పి‌పి‌ఈ కిట్లు ఇచ్చారు. అయితే బాలయ్య హిందూపురం అభివృద్ధి కోసం ప్రత్యర్ధి పార్టీ అయిన వైసీపీ నేతలతో సైతం మాట్లాడుతున్నారు. ఇటీవల రోజాతో హిందూపురం పారిశ్రామిక అభివృద్ధి గురించి మాట్లాడగా, ఆమె కూడా వెంటనే స్పందించి, బాలయ్యకు సహకారం అందిస్తానని చెప్పారు.

 

కాకపోతే బాలయ్య ఎక్కువ శాతం నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడం కాస్త ఇబ్బందే అవుతుంది. పైగా వైసీపీ అధికారంలో ఉండటం ఇక్బాల్‌కు కలిసొస్తుంది. ఆయన దగ్గర ఉండి ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారు. కానీ వైసీపీలో ఉన్న గ్రూపు తగాదాలు వల్ల బాలయ్యకు అడ్వాంటేజ్ అవుతుంది. ఏదేమైనా గానీ హిందూపురం ప్రజలు నందమూరి ఫ్యామిలీకి వీర విధేయులుగా ఉన్నంత కాలం ఇక్కడ బాలయ్య గెలుపు సులువే.

మరింత సమాచారం తెలుసుకోండి: