అనంతపురం జిల్లాలో పెద్దగా సంచలనాలు లేని నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మడకశిర నియోజకవర్గమే. ఈ నియోజకవర్గంలోని నేతలు ఎప్పుడు రాష్ట్ర స్థాయిలో హైలైట్ అయిన సందర్భాలు లేవు. కానీ 2018లో మాత్రం మడకశిర పేరు ఒక్కసారిగా ఏపీ పోలిటికల్ స్క్రీన్ ‌పైకి వచ్చింది. 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ తరుపున కె. ఈరన్న విజయం సాధించారు. అయితే ఆయన ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్‌ ఇవ్వడంతో, సుప్రీం కోర్టు ఆయన్ని అనర్హుడుగా ప్రకటించింది. దీంతో వైసీపీ నుంచి పోటీ చేసి ఈరన్న చేతిలో ఓటమిపాలైన డాక్టర్ తిప్పేస్వామి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.

 

ఇక ఒక సంవత్సరం పాటు ఎమ్మెల్యేగా కొనసాగిన తిప్పేస్వామి... 2019 ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ తరుపున బరిలో దిగి ఈరన్నపై విజయం సాధించారు. అయితే తిప్పేస్వామి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. 1994లో పలమనేరు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 1999లో అక్కడే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2008 వరకు పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేయగా, 2009లో చిత్తూరు ఎంపీగా పోటీ చేసి ఓడి పోయారు.

 

2014లో వైఎస్సార్‌సీపీ తరఫున మడకశిరలో పోటీ చేసి ఓటమి చెందినా.. సుప్రీంకోర్టు తీర్పుతో 2018లో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి మడకశిరలో సైలెంట్‌గా పనిచేసుకుంటున్నారు. తనకు సాధ్యమైన మేర పనులు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల పరంగా ఇక్కడ ఇలాంటి లోటు లేకపోయినా, అభివృద్ధి పరంగా మాత్రం చాలా లోటు కనిపిస్తోంది. ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో తిప్పేస్వామి కాస్త వెనుకబడి ఉన్నట్లు తెలుస్తోంది.

 

ఇక ఇక్కడ టీడీపీ తరుపున ఈరన్న యాక్టివ్‌గానే పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో వైసీపీ బలం తగ్గుతుండటంతో టీడీపీ పుంజుకున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల్లో 13 వేల మెజారిటీ తేడాతోనే ఓడటంతో, ఈరన్న నెక్స్ట్  ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేసుకుంటూ వెళుతున్నారు. ఈరన్నకు తోడుగా టీడీపీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కూడా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నారు. మొత్తానికైతే వైసీపీ ఎమ్మెల్యే టీడీపీకి పుంజుకునే ఛాన్స్ ఇచ్చినట్లే కనిపిస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: