2019 ఎన్నికల్లో చాలామంది వైసీపీ నేతలు జగన్ ఇమేజ్ వల్లే గెలిచిన విషయం తెలిసిందే. అలా జగన్ ఇమేజ్‌తో గెలిచిన వారిలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కూడా ఒకరు. 2014 ఎన్నికల్లో రెడ్డి శాంతికి శ్రీకాకుళం పార్లమెంట్ సీటు ఇచ్చారు.  ఆ ఎన్నికల్లో ఆమె కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో శాంతికి పాతపట్నం అసెంబ్లీ సీటు ఇచ్చారు. ఇక జగన్ గాలిలో శాంతి 15వేల పైనే మెజారిటీతో టీడీపీ అభ్యర్ది కలమట వెంకట రమణమూర్తిపై విజయం సాధించారు. పైగా వైసీపీ కూడా అధికారంలోకి రావడంతో శాంతి, నియోజకవర్గంలో మంచిగా పనిచేసుకుంటున్నారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

కాకపోతే శ్రీకాకుళం వైసీపీలో అందరూ రాష్ట్ర స్థాయి నాయకులే ఉన్నారు. కానీ శాంతికి మాత్రం ఆ ఇమేజ్ రాలేదు. ఇంకా జగన్ అందిస్తున్న పథకాలు, ఆయన ఇమేజ్ ఎమ్మెల్యేని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. అటు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా అంతంత మాత్రమే జరుగుతున్నాయి. ఇక ఇక్కడ టీడీపీ తరుపున వెంకట రమణమూర్తి ఉన్నారు. ఈయన 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచి, ఆ తర్వాత టీడీపీలోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓటమి వచ్చినా కార్యకర్తలకు అండగా ఉంటూ...ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడుతూనే ఉన్నారు.

పాతపట్నంలో పాతపట్నం, లక్ష్మీనర్సంపేట, వెళియాపుట్టి, కొత్తూరు, హీరా మండలాలు ఉన్నాయి. ఎక్కువగా గిరిజన గ్రామాలున్న ఈ నియోజకవర్గంలో సమస్యలకు కొదవలేదు. నాగావళి, వంశధారా నదులు ఇక్కడే ప్రవహిస్తున్నా, ఈ ప్రాంతపు రైతులకు ఒక చుక్క సాగునీరు కూడా రాదు. పాతపట్నంలో భూగర్భ డ్రైనేజీతోబాటు, గ్రామీణ ప్రాంతాలలో రహదారులు, వైద్య సదుపాయాలూ, విద్య, వీధి దీపాలు వంటి మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరముంది. గిరిజన గ్రామాలలో తాగునీరు ప్రధాన సమస్య. వర్షాకాలంలో కొండలపైన కురిసే నీటికోసం, వేసవిలో నీళ్లు నిలువనున్న చెలమలకోసం కిలోమీటర్ల దూరం మహిళలు, పిల్లలు కాలినడకనే వెళ్ళవలసి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: