నెల్లూరు జిల్లా అధికార వైసీపీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఈ జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాలు వైసీపీ ఖాతాలో పడిన విషయం తెలిసిందే. అలాగే ఉన్న ఎంపీ సీటు కూడా వైసీపీకే దక్కింది. అయితే ఇందులో మెజారిటీ ఎమ్మెల్యేలు కేవలం జగన్ ఇమేజ్ వల్లే గెలిచారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. అలా జగన్ ఇమేజ్‌తో గెలిచిన ఎమ్మెల్యేలు, ఈ ఏడాదిన్నర సమయంలో సొంత ఇమేజ్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

అయితే గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావుకు ఇంకా జగన్ ఇమేజ్ శ్రీరామరక్షగా ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఏడాదిన్నర సమయంలో ఎమ్మెల్యే ప్రజల మన్ననలు పొందడం తక్కువే అంటున్నారు. అలాగే ఎమ్మెల్యే ప్రజలకు పెద్దగా అందుబాటులో ఉన్న సందర్భాలు లేవు అంటున్నారు. కాకపోతే కొత్తగా సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాల నిర్మాణాలు జరుగుతున్నాయి.

ఇక ఇక్కడి ప్రజలు జగన్‌పై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాలు పార్టీకు ప్లస్ అవుతున్నాయి. నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు బాగుపడ్డాయి. ఇక అనూహ్యంగా తిరుపతి ఉప ఎన్నిక వస్తుండటం, విజయం తప్పనిసరి కావడంతో జగన్ అప్రమత్తమయ్యారు. తిరుపతి పార్లమెంటు నియోజకవవర్గం పరిధిలో ఉన్న సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా నిధులు విడుదల కానున్నాయి. దీంతో గూడూరులో కూడా అభివృద్ధి వేగంగా జరగనుంది.

అయితే నియోజకవర్గంలో దందాలు ఎక్కువైనట్లు తెలుస్తోంది. దీని వల్ల పార్టీకు చెడ్డపెరు వస్తుందని, ప్రజల్లో వ్యతిరేకిత పెరుగుతుందని సొంత పార్టీలోనే చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో ఎన్నికల్లో ఓడిపోయాక సైలెంట్‌గా ఉన్న టీడీపీ నేత సునీల్ కుమార్...ఇప్పుడు ఫుల్ యాక్టివ్ అయ్యారు. కార్యకర్తలని కలుపుకునిపోతూ..పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఇక గూడూరులో పలు సమస్యలు ఉన్నాయి. ఇటీవల వర్షాలకు రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. పంటలు సైతం చాలా నష్టపోయాయి. రైతులని ఆదుకోవాల్సిన అవసరముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: