శ్రీకాకుళం జిల్లాలో అధికార వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో రాజాం ఒకటి. గత రెండు పర్యాయాల నుంచి ఇక్కడ వైసీపీదే విజయం. అది కూడా వరుసగా కంబాల జోగులు విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే కంబాల జోగులు రాజకీయ జీవితం మొదలుపెట్టింది టీడీపీలోనే. 1999 ఎన్నికల సమయంలోనే ఈయన పాలకొండ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ అప్పుడు టికెట్ దక్కలేదు. ఇక 2004లో టికెట్ దక్కించుకుని వైఎస్ గాలిలో కూడా కాంగ్రెస్ అభ్యర్ధిపై విజయం సాధించారు.

ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్ళి 2009 ఎన్నికల్లో పాలకొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక వైసీపీ నుంచి 2014 ఎన్నికల్లో రాజాం నుంచి పోటీ చేసి, టీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీ స్పీకర్ ప్రతిభా భారతిపై కేవలం 512 ఓట్ల తేడాతో గెలిచారు. అప్పుడు అధికారంలో లేకపోయినా...పార్టీని వదిలిపెట్టకుండా నియోజకవర్గంలో పనిచేసుకున్నారు. దాంతో 2019లో జోగులు మరోసారి విజయం సాధించారు. అయితే ఈ సారి టీడీపీ తరుపున మాజీ మంత్రి కొండ్రు మురళి మోహన్ నిలబడ్డారు. సుమారు 17 వేల మెజారిటీ తేడాతో కొండ్రుని ఓడించారు. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన జోగులు..నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

ఎక్కడికక్కడ పార్టీని బలోపేతం చేస్తూ దూసుకెళుతున్నారు. ప్రభుత్వ పథకాలు, ఇళ్ల పట్టాలు బాగా ప్లస్ అవుతున్నాయి. అలాగే రాజాంలో సమస్యలు కూడా ఉన్నాయి. దశాబ్దాలుగా రాజాం రహదారులు మర్మత్తులకు, విస్తరణకు నోచుకోలేదు. ఎర్రచెరువు విస్తరణ, బలసాల రేవులో నాగావళి నది మీదుగా వంతెన నిర్మించాలని రాజాం వాసులు ఎన్నో ఏళ్ల నుంచి కోరుకుంటున్నారు. రేగిడి ఆమదాలవలస మండలంలో తాగునీటి కొరత ఉంది.

రాజకీయంగా చూసుకుంటే జోగులు స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఇక ఇక్కడ టీడీపీ తరుపున ఓడిపోయిన కొండ్రు మురళి పెద్ద యాక్టివ్‌గా లేరు. ఆయన పార్టీ మారిపోయే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఇక్కడ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ యాక్టివ్‌గానే ఉన్నారు. నియోజకవర్గంలో బాగానే తిరుగుతున్నారు. కొండ్రు మురళి సైడ్ అవ్వడంతో నెక్స్ట్ ఎన్నికల్లో తన కుమార్తెకు సీటు ఇప్పించుకోవాలని ప్రతిభా చూస్తున్నారు. మరి చూడాలి నెక్స్ట్ ఎన్నికల్లో ఏం జరుగుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: