విశాఖపట్నంలో టీడీపీకి అనుకూలమైన నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఎక్కువసార్లు పసుపు జెండా ఎగిరిన నియోజకవర్గాల్లో మాడుగుల కూడా ఒకటి. 1983 నుంచి 1999 వరకు జరిగిన ఐదు ఎన్నికల్లో ఇక్కడ టీడీపీదే విజయం.


అయితే 2004లో కాంగ్రెస్ వేవ్‌లో టీడీపీ తొలిసారి ఓడిపోయింది. ఇక 2009లో పుంజుకుని మళ్ళీ గెలిచింది. కానీ వైసీపీ ఎంటర్ అయ్యాక పరిస్తితి మారిపోయింది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా మాడుగుల వైసీపీ వశం అవుతుంది. గత రెండు పర్యాయాలు వైసీపీ తరుపున బూడి ముత్యాలనాయుడు గెలుస్తూ వస్తున్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ముత్యాల నాయుడు నియోజకవర్గంలో దూకుడుగా పనిచేస్తున్నారు.


ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో కొత్తగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు జరిగాయి. అటు కరోనా సమయం కావడంతో ప్రజలకు అండగా ఉంటూ, వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా కృషి చేస్తున్నారు. కాకపోతే ఏజెన్సీ ప్రాంతాల్లో సరైన రోడ్లు, వైద్య సదుపాయాలు లేవు. అటు తాగునీటి సమస్య ఎక్కువగానే ఉంది. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు సరైన ఇళ్ళు కూడా లేవు. అయితే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్ళు కట్టిస్తున్న విషయం తెలిసిందే.


ఇక రాజకీయంగా చూసుకుంటే మాడుగులలో ముత్యాలనాయుడు బాగా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఇటీవల స్థానిక ఎన్నికల్లో సైతం వైసీపీకి మంచి విజయాలు అందించారు. ఇక్కడ టీడీపీకి పెద్ద ఛాన్స్ ఇవ్వకుండా దూసుకెళుతున్నారు. అయితే ఎమ్మెల్యేకు చెక్ పెట్టడానికి టీడీపీ నేత గవిరెడ్డి రామానాయుడు సైతం ప్రయత్నిస్తున్నారు. 2009లో రామానాయుడు మాడుగులలో గెలిచారు. ఇక గత రెండు పర్యాయాలు ఓడిపోతూ వస్తున్నారు. ఈ సారి మాత్రం ముత్యాల నాయుడుకు ఛాన్స్ ఇవ్వకూడదని చూస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్తితుల్లో మాడుగుల వైసీపీకి కంచుకోటగా మారిపోయింది. మరి నెక్స్ట్ ఎన్నికల్లో రామానాయుడు వైసీపీకి ఎలా చెక్ పెడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: