కడప జిల్లా అంటేనే వైఎస్సార్సీపీ కంచుకోట. ఆ జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గం వైసీపీకి అనుకూలమైన నియోజకవర్గమే. గత ఎన్నికల్లో జిల్లాలో ఉన్న పది స్థానాల్లో వైసీపీ గెలిచింది. అలా వైసీపీకి కంచుకోటలుగా ఉన్న కడప జిల్లాలో టీడీపీకి గెలిచే ఛాన్స్ ఉందా? అంటే ఒక స్థానంలో మాత్రం టీడీపీకి ఆ ఛాన్స్ దొరికేలా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


అలా టీడీపీకి కాస్త అనుకూల వాతావరణం కనిపిస్తున్న నియోజకవర్గం మైదుకూరు అని చెప్పొచ్చు. ఇక్కడ మొదట నుంచి టీడీపీకి అనుకూలమైన పరిస్తితి లేదు. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి చూసుకుంటే టీడీపీ కేవలం రెండుసార్లే గెలిచింది. 1985, 1999 ఎన్నికల్లో మాత్రం టీడీపీ గెలిచింది. ఎక్కువసార్లు కాంగ్రెస్ గెలిచింది. అది కూడా డి‌ఎల్ రవీంద్రనాథ్ రెడ్డి ఎక్కువసార్లు గెలిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోవడంతో మైదుకూరు వైసీపీకి కంచుకోటగా మారింది.


గత రెండు పర్యాయాలు నుంచి ఇక్కడ వైసీపీ నుంచి శెట్టిపల్లి రఘురామిరెడ్డి గెలుస్తూ వస్తున్నారు. అయితే ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడుగా ఉన్న శెట్టిపల్లి గతంలో టీడీపీ నుంచి రెండుసార్లు గెలిచారు. అలాగే నాలుగుసార్లు ఓటమి పాలయ్యారు. అలా టీడీపీలో దశాబ్దాల పాటు కష్టపడిన శెట్టిపల్లి 2014 ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చి మళ్ళీ వరుసగా విజయాల బాట పట్టారు. గత రెండు పర్యాయాలు నుంచి టీడీపీ తరుపున పుట్టా సుధాకర్ యాదవ్ ఓడిపోతూ వస్తున్నారు.


సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న శెట్టిపల్లి నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఉంటున్నారు. ఇక్కడ సమస్యలపై ఆయనకు మంచి అవగాహన ఉంది. అందుకే సమస్యలు పరిష్కరించడంలో ముందున్నారు. అటు మైదుకూరు ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఏ లోటు లేకుండా అందుతున్నాయి. జగనన్న కాలనీల పేరిట పేదలకు ఇళ్ళు కట్టించే కార్యక్రమం వేగంగా జరుగుతుంది. రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాల నిర్మాణాలు జరిగాయి. నాడు-నేడు కార్యక్రమం ద్వారా మైదుకూరులో ప్రభుత్వ పాఠశాలలు బాగుపడ్డాయి. ఇక ఇక్కడ పలు సమస్యలు ఉన్నాయి. మైదుకూరు పట్టణంలో తాగునీరు, డ్రైనేజ్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి.

 

రాజకీయంగా చూసుకుంటే వైసీపీ బలంగానే ఉన్నా సరే, టీడీపీ బలోపేతం అవుతుండటం ఎమ్మెల్యేకు మైనస్ అవుతుంది. ఇక్కడ టీడీపీ తరుపున పుట్టా సుధాకర్ యాదవ్ పనిచేస్తున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా పుట్టా నియోజకవర్గంలో మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వరుసగా ఓటమి పాలవ్వడంతో పుట్టాపై సానుభూతి పెరుగుతుంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో మైదుకూరులో టీడీపీ సత్తా చాటింది. మైదుకూరు మున్సిపాలిటీలో 24 వార్డుల్లో టీడీపీ 12 గెలిస్తే, వైసీపీ 11 గెలవగా, జనసేన ఒకటి గెలిచింది. కానీ అధికారంలో ఉండటంతో మున్సిపాలిటీ వైసీపీ ఖాతాలో పడింది. అయినా సరే మైదుకూరులో టీడీపీకి కాస్త అనుకూల పరిస్తితులు ఏర్పడ్డాయని చెప్పొచ్చు. మరి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీకి ఛాన్స్ వస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: