కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం....మొన్నటివరకు కాంగ్రెస్‌కు కంచుకోట కాగా, గత రెండు ఎన్నికల నుంచి వైసీపీకి కంచుకోటగా మారింది. అయితే పార్టీల పరంగా కాకుండా చెబితే పాణ్యం...కాటసాని రామ్ భూపాల్ రెడ్డి కంచుకోట అని చెప్పొచ్చు. ఎందుకంటే 1985, 1989, 1994, 2004, 2009 ఎన్నికల్లో పాణ్యం నుంచి కాటసాని కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా నిలబడి దాదాపు 60 వేల పైనే ఓట్లు తెచ్చుకుని, రెండోస్థానంలో నిలిచారు.

ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఇన్నిసార్లు కాటసాని ఎమ్మెల్యేగా గెలిచారంటే...పాణ్యం నియోజకవర్గ ప్రజలతో ఆయనకు ఉన్న బాండింగ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఆరోసారి ఎమ్మెల్యేగా ఇప్పుడు కాటసాని...పాణ్యం ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అటు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి.

పాణ్యంలో నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు రూపు రేఖలు మారిపోయాయి. అటు జగనన్న కాలనీల ద్వారా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పేదలకు ఇళ్ళు కట్టించే కార్యక్రమం జరుగుతుంది. పాణ్యంలో కొత్తగా రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, గ్రామాల్లో సి‌సి రోడ్లు, వాటర్ ట్యాంక్‌ల నిర్మాణాలు, రైతు బజార్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.

అలాగే నియోజకవర్గంలో అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కాటసాని కృషి చేస్తున్నారు. అటు తాగునీరు, సాగునీరు సమస్యలు రాకుండా చూసుకుంటున్నారు. ముఖ్యంగా రైతుల సమస్యల విషయంలో ఎక్కువ చొరవ తీసుకుంటున్నారు. ఇక రాజకీయంగా చూసుకుంటే పాణ్యంలో కాటసానిని ఓడించడం గగనమే అని చెప్పొచ్చు. ఇక్కడ టీడీపీ తరుపున పని చేస్తున్న గౌరు చరితా రెడ్డి ఏ మాత్రం పుంజుకోలేదు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి వన్‌సైడ్ విజయాలు దక్కాయి. మొత్తానికైతే పాణ్యంలో కాటసాని, చరితాకు గెలిచే ఛాన్స్ ఇచ్చేలా కనిపించడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: