అధికార వైసీపీ ఎమ్మెల్యేల్లో ఎంతమంది రెండేళ్లలో మంచి పనితీరు కనబర్చారు? ఎంతమంది ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు? ఎంతమందికి తిరిగి మళ్ళీ ఎమ్మెల్యేలుగా గెలిచే సత్తా ఉంది? అంటే వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకిత వస్తున్నట్లు కనిపిస్తోంది. అలా వ్యతిరేకిత వస్తున్న వారిలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ ముందు వరుసలో ఉన్నారని విశ్లేషణలు వస్తున్నాయి.

2014లో వైసీపీ తరుపున తిరుపతి ఎంపీగా గెలిచిన వరప్రసాద్, 2019 ఎన్నికల్లో గూడూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అది కూడా టీడీపీపై వ్యతిరేకిత, జగన్ వేవ్‌లో భారీ మెజారిటీతో గెలిచేశారు. మరి భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే, అంతే భారీగా ప్రజలకు సేవ చేస్తున్నారా? అంటే ఆ పెద్దగా లేదనే చెప్పొచ్చు. మొదట నుంచి నియోజకవర్గంలోవరప్రసాద్ దూకుడుగా పనిచేసిన సందర్భాలు లేవు. ఏదో ప్రభుత్వం తరుపున జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తప్ప, గూడూరులో కొత్తగా జరిగే అభివృద్ధి పనులు ఏమి లేవు.

పైగా ఈయన ప్రజలకు అందుబాటులో ఉండటం కూడా తక్కువే అని టాక్. అలాగే గూడూరులో దందాలు, ఇసుక, ఇళ్ల స్థలాల్లో అక్రమాలు ఎక్కువగానే జరిగాయని తెలుస్తోంది. ఇవన్నీ ఎమ్మెల్యేకు మైనస్ అవుతున్నాయి. అయితే ఎమ్మెల్యేకు ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ జగన్ ఇమేజ్...అందుకే స్థానిక ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి మంచి విజయాలు దక్కాయి. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో గూడూరు నుంచి వైసీపీకి మంచి మెజారిటీ కూడా వచ్చింది.

ఇక ఇక్కడ వైసీపీలో గ్రూపు రాజకీయాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఎమ్మెల్యే తీరుపై పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, నేదురుమల్లి రామ్ కుమార్‌రెడ్డి, ధనుంజయరెడ్డి లాంటి నాయకులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. అసలు ఎమ్మెల్యే గ్రూపుకు, అసంతృప్తి నేతల గ్రూపుకు పెద్దగా పొసగడం లేదని తెలుస్తోంది. ఇలా ప్రతి అంశంలోనూ ఎమ్మెల్యేకు మైనస్ అవ్వడమే, టీడీపీకి ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. ఇక్కడ టీడీపీ తరుపున పాశం సునీల్ కుమార్ పనిచేస్తుండగా, ఆయన ప్రజల సమస్యలపై బాగానే పోరాటం చేస్తున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో వరప్రసాద్ వైసీపీ తరుపున నిలబడితే పాశం గెలుపు సులువే అని నెల్లూరు జిల్లాలో టాక్. మొత్తానికైతే గూడూరులో వరప్రసాద్‌కు అంత అనుకూల పరిస్తితులు ఉన్నట్లు కనిపించడం లేదు.    


మరింత సమాచారం తెలుసుకోండి: