ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం....తెలుగుదేశం పార్టీకి కాస్త అనుకూలమైన నియోజకవర్గం..ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ మంచి విజయాలే సాధించింది. అయితే 2009 ఎన్నికల నుంచి అద్దంకిలో రాజకీయ పరిస్తితులు మారిపోయాయి. ఈ నియోజకవర్గం ఒక పార్టీకి కంచుకోట కాకుండా, గొట్టిపాటి రవికుమార్ అడ్డాగా మారిపోయింది. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అద్దంకి ప్రజలు మద్ధతు ఇస్తూ వచ్చారు.

2009 ఎన్నికల్లో గొట్టిపాటి రవి, కాంగ్రెస్ తరుపున పోటీ చేసి అద్దంకి బరిలో గెలిచారు. ఇక తర్వాత ఆయన వైసీపీలోకి వచ్చి 2014లో పోటీ చేసి విజయం సాధించారు. అయితే అప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో గొట్టిపాటి, చంద్రబాబు చెంత చేరారు. ఇక అధికారంలో ఉన్నన్ని రోజులు గొట్టిపాటికి బాగానే కలిసొచ్చింది. అయితే అదృష్టం ఏంటో గానీ వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు అంతా 2019 ఎన్నికల్లో ఓడిపోతే, ఒక్క గొట్టిపాటి మాత్రం టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు.

అంటే గొట్టిపాటి అద్దంకిలో హ్యాట్రిక్ కొట్టారు. అయితే టీడీపీ ప్రతిపక్షానికి పరిమితం కావడంతో గొట్టిపాటి సైలెంట్ అయిపోయారు. పైగా వైసీపీ...గొట్టిపాటి బిజినెస్‌లని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ, ఆయన్ని ఆర్ధికంగా దెబ్బకొట్టాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. దీంతో గొట్టిపాటి , వైసీపీలోకి వెళ్లిపోతారని అంతా అనుకున్నారు. కానీ గొట్టిపాటి టీడీపీలోనే ఉన్నారు.

అటు వైసీపీ తరుపున అద్దంకిలో బాచిన కృష్ణచైతన్య పనిచేస్తున్నారు. అధికారంలో ఉండంతో చైతన్య, అద్దంకిలో బాగానే పనులు చేయిస్తున్నారు. పథకాలు చైతన్యకు ప్లస్ అవుతున్నాయి. అయితే తాజాగా వస్తున్న సర్వేల్లో గొట్టిపాటి, అద్దంకిలో బాగా వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది. ఈ సారి గొట్టిపాటి గెలవడం కష్టమే అని సర్వే చెబుతోంది. ప్రతిపక్షంలో ఉండటంతో గొట్టిపాటి పెద్దగా పనులు కూడా చేయలేకపోతున్నారు. దీంతో ఈ సారి గొట్టిపాటికి అద్దంకిలో నాలుగో విజయం దక్కడం కష్టమే అని తెలుస్తోంది. మరి చూడాలి వచ్చే ఎన్నికల్లో అద్దంకిలో రాజకీయాలు ఎలా ఉంటాయో?  


మరింత సమాచారం తెలుసుకోండి: