ఏపీలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో టి‌డి‌పికి పెద్ద పట్టు ఉండదనే చెప్పొచ్చు. ఏజెన్సీ నియోజకవర్గాల్లో టి‌డి‌పికి పెద్దగా విజయాలు కూడా దక్కడం కష్టమే. గత ఎన్నికల్లో ఏజెన్సీ నియోజకవర్గాల్లో టి‌డి‌పి ఘోరంగా ఓడిపోయింది. ఇదే క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న రంపచోడవరంలో కూడా టి‌డి‌పి ఓటమి పాలైంది. 2008 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన రంపచోడవరంలో టి‌డి‌పి ఇంతవరకు గెలవలేదు.

2009లో ఇక్కడ కాంగ్రెస్ గెలవగా, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వైసీపీ గెలిచింది. అయితే 2014లో వైసీపీ తరుపున గెలిచిన వంతల రాజేశ్వరిని టి‌డి‌పిలోకి తీసుకున్నారు. అయినా సరే 2019 ఎన్నికల్లో రాజేశ్వరి టి‌డి‌పి తరుపున పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. టీచర్ ఉద్యోగాన్ని వదులుకుని మరీ రాజకీయాల్లోకి వచ్చిన నాగులపల్లి ధనలక్ష్మి వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఎమ్మెల్యేగా ధనలక్ష్మి పర్వాలేదనిపించుకుంటున్నారు.

ఈమె పనితీరు అంత గొప్పగా లేకపోయినా జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు వల్ల రంపచోడవరంలో వైసీపీ ఇంకా బలంగా ఉంది. అయితే నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలు మినహా ఇక్కడ అభివృద్ధి ఏమి జరగడం లేదు. గిరిజన ప్రాంతం కావడంతో రోడ్ల సౌకర్యం అంతంత మాత్రమే. రూరల్ గ్రామాల్లో బస్సు సౌకర్యం కూడా ఉండదు. ముఖ్యంగా హాస్పిటల్స్ పెద్దగా అందుబాటులో లేవు. దాని వల్ల ఇక్కడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీల పరిస్తితి దయనీయం. అలాగే స్వచ్ఛమైన తాగునీరు ఇక్కడ ప్రజలకు అందడం గగనమే.

ఈ సమస్యలు ఎమ్మెల్యేకు మైనస్ అవుతున్నాయి. అటు ధనలక్షి కేవలం ఎమ్మెల్యేగా ఉంటే ఇక్కడ వైసీపీ నేత అనంత ఉదయ భాస్కర్ పెత్తనమే ఎక్కువ ఉందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ధనలక్ష్మికి సీటు ఇప్పించింది కూడా ఉదయ భాస్కర్ అనే టాక్. అందుకే ఇక్కడ ఏ పని అయినా ఉదయ్ భాస్కర్ కనుసన్నల్లోనే జరగాలని తెలుస్తోంది. ఇక ఉదయ భాస్కర్ పెత్తనం పట్ల ఎమ్మెల్యే వర్గం అసంతృప్తిగానే ఉంది.

 
ఇక టి‌డి‌పి తరుపున మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పనిచేస్తున్నారు. ఓడిపోయాక ఇప్పుడుప్పుడే రాజేశ్వరి యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. పైగా నారా లోకేష్ నియోజకవర్గంలో పర్యటించడం రాజేశ్వరికి కాస్త ప్లస్ అవుతుంది. ఆయన పోలవరం నిర్వాసితులకు అండగా నియోజవర్గంలో తిరిగారు. అటు నిర్వాసితులని జగన్ ప్రభుత్వం  ఆదుకునే ప్రయత్నం చేయడం లేదు. ఎన్నికల ముందు పాదయాత్ర సమయంలో ఎకరానికి రూ. 10 లక్షలు ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక జగన్, నిర్వాసితులకు హ్యాండ్ ఇచ్చారని లోకేష్ ఫైర్ అవుతున్నారు. ఈ అంశం కూడా వైసీపీకి మైనస్ అయ్యేలా కనిపిస్తోంది. మొత్తానికైతే వచ్చే ఎన్నికల్లో ధనలక్ష్మికి రాజేశ్వరి గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: