ఈ సారి మంత్రి పదవిపై చాలామంది ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. జగన్ కరుణిస్తే ఒక్కసారి మంత్రి అనిపించుకోవాలని చాలామంది ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు. అలా జగన్ కరుణ కోసం చూస్తున్నవారిలో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కూడా ఒకరు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలరాజు...వైఎస్సార్ ఫ్యామిలీకి వీర విధేయుడు. 2004, 2009 కాంగ్రెస్ తరుపున గెలిచి, ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళి 2012 ఉపఎన్నిక, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

మొదట సారే తనకు మంత్రిగా ఛాన్స్ వస్తుందని బాలరాజు అనుకున్నారు. కానీ సామాజికవర్గాల సమీకరణాల్లో భాగంగా బాలరాజుకు పదవి మిస్ అయింది. ఎస్సీ కోటాలో ఇటు పశ్చిమ గోదావరిలో తానేటి వనిత, అటు తూర్పు గోదావరిలో పినిపే విశ్వరూప్‌లు మంత్రులు అయ్యారు. ఇక ఈ సారి మంత్రివర్గ విస్తరణలో వనిత, విశ్వరూప్‌లని జగన్ సైడ్ చేయొచ్చని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఎస్సీ కోటాలో తనకు ఛాన్స్ వస్తుందని బాలరాజు ఆశగా చూస్తున్నారు.

మంత్రి పదవి ఆశలు పక్కనబెడితే ఎమ్మెల్యేగా బాలరాజు బాగానే పనిచేసుకుంటున్నారు. పోలవరంలో ప్రభుత్వం తరుపున జరిగే అన్నీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి. బాలరాజు సైతం ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అయితే నియోజకవర్గంలో రోడ్ల పరిస్తితి మరీ దారుణంగా ఉంది. వర్షాలకు బాగా దెబ్బతిని గుంతలు పడిపోయాయి. తక్షణమే రోడ్లని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.

ఇక పోలవరం ప్రాజెక్టు విషయంలో ముంపు బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరముంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు సరైన రవాణా, విద్యా, వైద్య సదుపాయాలు కల్పించాల్సి ఉంది. రాజకీయంగా బాలరాజు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. టి‌డి‌పి తరుపున బొరగం శ్రీనివాసరావు పనిచేస్తున్నారు. ఆయన కొంతమేర ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అయితే బాలరాజుకు చెక్ పెట్టే స్థాయిలో ఇక్కడ టి‌డి‌పి లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: