అధికార వైసీపీలో తక్కువ సమయంలోనే మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న యువ ఎమ్మెల్యేలకు ఎలాంటి కొదవ లేదు. అలా తక్కువ సమయంలోనే ఫాలోయింగ్ పెంచుకున్న ఎమ్మెల్యేల్లో అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఒకరు. గత ఎన్నికల్లో అదీప్ వైసీపీ నుంచి పెందుర్తి బరిలో నిలబడి టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయమూర్తిని ఓడించారు.

ఇలా ఓ సీనియర్ నేతని ఓడించిన అదీప్ ఎమ్మెల్యేగా దూసుకెళుతున్నారు. పెందుర్తి ప్రజలకు అండగా ఉంటూ, వారి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నారు. అలాగే పెందుర్తిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం, తాగునీటి వసతులు, నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు బాగుచేయడం లాంటి కార్యక్రమాలు చేశారు. కొత్తగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు జరిగాయి.

అయితే పెందుర్తిలో సమస్యలు కూడా ఉన్నాయి. కీలకమైన సింహాచలంకు చెందిన భూములు విషయం, పంచగ్రామాలు సమస్యలు ఉన్నాయి. పెందుర్తిలో ప్రజలకు అవసరాలకు తగ్గట్టుగా ఓ ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించాల్సిన అవసరముంది. అటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే జరుగుతుంది. గంగవరం పోర్టు విషయంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి.

రాజకీయంగా చూస్తే అదీప్‌కు ఎమ్మెల్యేగా మార్కులు బాగానే పడుతున్నాయి. కానీ సమస్యలు వల్ల ఎమ్మెల్యేకు ఇబ్బంది వచ్చే పరిస్తితి ఉంది. అటు టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పైగా బండారు వారసుడు అప్పలనాయుడు సైతం నియోజకవర్గంలో యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. అదీప్‌పై ఆయన ఫ్యామిలీపై భూ కబ్జాల ఆరోపణలు వస్తున్నాయి. ఇక తాజాగా వెలువడిన ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల ఫలితాల్లో పెందుర్తిలో వైసీపీ హవా కొనసాగింది. 42 ఎం‌పి‌టి‌సి స్థానాల్లో 34 గెలుచుకుంది. టి‌డి‌పి కూడా గట్టిగానే పోటీ ఇచ్చి 8 చోట్ల గెలిచింది. ఏదేమైనా బండారు ఫ్యామిలీతో అదీప్ కాస్త జాగ్రత్తగానే ఉండాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: