దేవి నవరాత్రులు ఆరవరోజు ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని ‘శ్రీ మహాలక్ష్మి’ గా అలంకరిస్తారు. మంగళప్రదమైన దేవతగా మహాలక్ష్మి అవతారాన్ని చెబుతారు. జగన్మాత మహాలక్ష్మి అవతారంలో దుష్ట రాక్షస సంహారాన్ని చేసింది. 

మూడు శక్తులలో ఒక శక్తి అయిన శ్రీ మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపి హాలుడు అనే రాక్షసుడిని సంహరించిందని పురాణాలు చెబుతున్నాయి. మహాలక్ష్మిని దర్శిస్తే భక్తులకు ఐశ్వర్య ప్రాప్తి, విజయం లభిస్తాయని నమ్మకం. కమలాలు రెండు చేతులలో ధరించి, అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా ఈరోజు ‘శ్రీమహాలక్ష్మి’ రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. 

మహాలక్ష్మి సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మి అని అంటారు. ఈ నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారు డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది అనే కథ ఉంది.  ”యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే అన్ని జీవలలోనూ ఉండే లక్ష్మీస్వరూపం దుర్గాదేవి అని చండీసప్తసతి చెబుతోంది. 

కాబట్టి శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ శుభాలు కలుగుతాయి. ”ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. పూర్ణాలు నివేదన చెయ్యాలి లక్ష్మి యంత్రాన్ని పూజించాలి.  ఎరుపు రంగు పూలతో పూజించాలి, లక్ష్మీ స్తోత్రాలను పఠించాలి.

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం - దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం -శ్రీమన్మంద కటాక్ష లబ్ధవిభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం - త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం అంటూ ‘శ్రీ మహాలక్ష్మి’ ని పూజిస్తే సకల సంపదలు ప్రాప్తిస్తాయి. 

ఇదేరోజు కొన్ని ఆలయాలలో అమ్మవారిని చండికగా భావించి విశేష పూజలు చేస్తారు. ఈ రూపంలో ఉన్న అమ్మవారి పూజించడం సకల సంపత్కరం అనే భావన కూడ ఉంది. అక్షరమాల కపాలం తామరపువ్వు బంగారు కలశం శిరస్సు పై బాలచంద్రుడుని ధరించి అమ్మ ఈరోజు ఈ రూపంలో కూడ పూజలు అందుకుంటుంది శ్రీ మహాలక్ష్మి..


మరింత సమాచారం తెలుసుకోండి: