శ్రీరామ శబ్దంలో పవిత్రత ఉంది శ్రీరామ శబ్దంలో ఏకాగ్రత ఉంది. వీటి అన్నింటా మించి  శ్రీరామ శబ్దంలో కర్తవ్య పరిపాలన ఉన్న నేపధ్యంలో శ్రీరాముడి ఆలయం లేనిగ్రామం మన భారత దేశంలో కనిపించదు. భారతీయ సంస్కృతిలో యుగయుగాల నుండి పెనవేసుకుపోయిన శ్రీరామ పద మాధుర్యం పై ఎందరో  ఋషులు పండితులు తత్వ వేత్తలు తమతమ స్థాయిలలో శ్రీరామ శబ్దం పై అవి భాషణలు ఇస్తూనే ఉన్నారు.  


దశావతార పురుషుడు శ్రీరాముడు జన్మించిన శుభదినమే శ్రీరామనవమి. రాముడు పుట్టినరోజును పండుగలా జరుపుకోవడం త్రేతాయుగం నుండి కొనసాగుతూనే ఉంది. శ్రీ సీతారామలక్ష్మణ భరత శతృఘ్నులతో కూడిన పటము లేని ఇల్లు ఇప్పటికి మన గ్రామాలలో చాల అరుదుగా కనిపిస్తుంది. రాముడు కోసల దేశాధీశ్వరుడైన దశరథునకు కౌశల్య చైత్రశుద్ధ నవమినాడు పునర్వసు నాలుగో పాదాన కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పుట్టాడు.  దీనికితోడు శ్రీరామ కళ్యాణం కూడ రాముడు పుట్టినరోజునే జరగడంతో ప్రతీ సంవత్సం చైత్రశుద్ద నవమిరోజును శ్రీరామ నవమిగా జరుపుకుంటూ ఆరోజున సీతారామ కళ్యాణం జరపడం అనాదిగా వస్తున్నఆచారం.

రావణ సంహార నిమిత్తం దేవతల ప్రార్ధనలు మన్నించి శ్రీమహా విష్ణువు నరుడై జన్మించాడు. ఆదిశేషుడు లక్ష్ముణునిగా శంఖ చక్రములు భరత శత్రుఘ్ర్నలుగా శ్రీమహాలక్ష్మి సీతగా  అయోనిజయై జనక మహారాజు ఇంట పెరిగి ఇదేరోజు శ్రీరామ చంద్రుడిని వివాహం చేసుకుంది. ‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే’ అనే  ఈ శ్లోకం మూడు సార్లు స్మరించితే చాలు ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ  ఫలితం వస్తుంది అంటారు. మానవులకు ‘రామనా స్మరణ' జ్ఝానంతో పాటు జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది అని మన నమ్మకం.  

శ్రీరాముడు నీలమేఘ శ్యాముడుగా ఉండటం వెనుక ఒక పరమార్ధం ఉంది. ఆకాశం నీల వర్ణంతో ఉంటుంది. అందువల్లనే రాముడు రూపం పంచ భూతాలతో ఒకటైన ఆకాశాలతో ప్రతీక అన్న వాదం కూడ ఉంది. అలాగే సీతమ్మ భూమి నుంచి జన్మించింది. పంచభూతాలలో మొదటిది అయిన భూమాతకు సీతాదేవి చిహ్నం. అందువల్లనే సీతారామ కళ్యాణం రోజున ప్రకృతి పులకరిస్తుంది అన్న నానుడి కూడ ఉంది. సాధారణ వ్యక్తులకు పెద్దగా పాండిత్య జ్ఞానం ఉండదు కాబట్టి రామకోటి వ్రాయడం శ్రీరామ భజన చేయడం ద్వారా శ్రీరామ అనుగ్రహానికి పాత్రులు కావచ్చు అని అంటారు. నేడు భారతదేశం యావత్తు అయోధ్య నుండి భద్రాచలం వరకు అన్ని వైష్ణవ దేవాలయాలలో శ్రీరామ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తారు. భార్య భర్తల అనుబంధానికి మాత్రమే కాదు లోక కళ్యాణానికి సంకేతంగా ఒక మనిషి ఎలా జీవించాలో తెలిపే విలువలకు నిదర్శనంగా చెప్పబడే శ్రీరాముడి జీవితం అందరికీ ఆదర్శప్రాయం..  


మరింత సమాచారం తెలుసుకోండి: