ప్రేమ కంటే స్నేహం గొప్పదని చెప్పడానికి ప్రముఖ తమిళ దర్శకుడు కదిర్ ప్రేమదేశం సినిమా తెరకెక్కించి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాడు. అబ్బాస్, వినీత్, టబు ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా కాదల్ దేశం తెలుగులో ప్రేమదేశం గా డబ్ కాబడింది. 1996 వ సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. స్టైలిష్ స్టార్ గా అబ్బాస్, నాచురల్ స్టార్ గా వినీత్, దేవకన్య లాంటి టబు ప్రేమదేశం సినిమాలో నటించడం ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.


ఈ చిత్ర కథ విషయానికి వస్తే... భద్ర శత్రుత్వం కలిగిన 2 కాలేజీలలో చదువుకునే ఆనంద్(వినీత్), అరుణ్(అబ్బాస్) అనే ఇద్దరు విద్యార్థులు అనుకోకుండా ప్రాణ స్నేహితులు అవుతారు. ఆనంద్ అనాధ కాగా...అతడు కటిక పేదరికం లో జీవిస్తుంటాడు. అతనికి కూడా తన కాలేజీ విద్యార్థులు లాగా మంచి డ్రెస్సులు వేసుకోవాలనే ఉంటుంది కానీ అతని పేదరికం తన ఆశలపై నీళ్లు చల్లుతుంది. ఇది తెలుసుకున్న అరుణ్ ఆనంద్ ని అనుసరించి అతడికి ఏది ఇష్టమో అవన్నీ కొని తెచ్చిపెడతాడు. స్నేహంలో ఇవన్నీ కామన్ అని అరుణ్ ఆనంద్ కి చెప్పే డైలాగ్ అందరిని భావోద్వేగానికి గురిచేస్తుంది. ఏఆర్.రెహమాన్ స్వరపరచిన ముస్తఫా ముస్తఫా పాట కూడా స్నేహితుల రోజు ప్రతి ఒక్కరు స్మరించుకునే పాట. ప్రాణ స్నేహితులైన ఆనంద్, అరుణ ఒకరికోసం ఒకరు ఎంతటి సాహసం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. స్నేహం గురించి చూపించిన అన్ని సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి.


ఎప్పుడైతే దివ్య(టబు) ఆనంద్, అరుణ్ జీవితంలో అడుగు పెట్టిందో ఆ క్షణం నుండి వారి స్నేహం లో ఎన్నో గొడవలు జరుగుతుంటాయి. నిజానికి తామిద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నాము అని తెలిసి కూడా ఒకరినొకరు పల్లెత్తు మాట కూడా అనుకోరు. వీళ్ళిద్దరూ దివ్య కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆమె ప్రాణాలను కాపాడుతారు. దీంతో దివ్య వాళ్ళిద్దరికీ బాగా దగ్గర అవుతుంది. దివ్య లేకపోతే బతకలేమని ఒకరి ప్రేమను మరొకరు త్యాగం చేయలేక ఇద్దరూ ఏం చేయాలో తెలియక శోకసంద్రంలో మునిగి పోతారు. చివరికి దివ్యకి కూడా ఆనంద్, అరుణ్ ప్రాణ స్నేహితులు అని తెలుస్తుంది. దాంతో ఒక్కసారిగా ఆమె మనసు వెయ్యి ముక్కలు అవుతుంది. ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకుంటావని ఆనంద్, అరుణ్ దివ్యని ప్రశ్నించగా... ఒకరిని పెళ్లి చేసుకుని సంతోషపెట్టి మరొకని తిరస్కరించి బాధ పెట్టలేనని, అందరం స్నేహితులుగా మారి పోదాం అని, ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకోనని చెప్పి దూరంగా వెళ్లి పోతుంది.



ఆ క్రమంలోనే రౌడీలు ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తుండగా అరుణ్,  ఆనంద్ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమెను కాపాడుతారు. దీంతో తనపై అరుణ్ ఆనంద్ లకు ఉన్న ప్రేమ కళ్ళారా చూసి వీళ్ళిద్దరిని నేను ఎందుకు బాధ పెట్టి దూరంగా వెళ్లిపోవడానికి సిద్ధమయ్యానని ఎంతో బాధపడుతూ వాళ్ళు ఇద్దరితో కలిసి ఎప్పటికీ స్నేహితురాలు లాగానే జీవించాలని నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత సినిమా చివర్లో 'తల్లి- తండ్రి, అన్నా-చెల్లెలు, భార్య-భర్త ప్రేయసి-ప్రియులు వీళ్ళందరూ స్నేహాన్ని పంచుకుంటూ పెంచుకున్న నాడే జీవితం అర్ధవంతమవుతుంది. స్నేహని స్వార్థం లేదు. అది పవిత్రమైనది. FRIENDSHIP LASTS FOREVER' అని ప్రేమదేశం సినిమాని ముగిస్తాడు కదిర్.


Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: