టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేపు తన 49వ జన్మదినాన్ని జరుపుకోనున్నారు. మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా మొదటగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా పరిచయమైన పవన్, ఆ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నారు. ఆ తరువాత వచ్చిన గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, బద్రి, ఖుషి సినిమాలు ఒకదానిని మించేలా మరొకటి అద్భుత విజయాలు అందుకుని పవన్ కు ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ని తెచ్చిపెట్టాయి. అక్కడి నుండి వరుసగా అవకాశాలతో కొనసాగిన పవన్ కళ్యాణ్, టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా అన్న చిరంజీవి కి తగ్గ తమ్ముడిగా ప్రత్యేకమైన ఇమేజ్ ని దక్కించుకున్నారు.  

ఇక ఇటీవల తన జనసేన పార్టీ కార్యకలాపాల్లో బిజీ అయిన పవన్ కళ్యాణ్, మళ్ళి కొద్దిరోజుల క్రితం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ మూవీ ద్వారా సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయ్యారు. ప్రస్తుతం వకీల్ సాబ్ తో పాటు హృద్యమైన సినిమాల దర్శకుడు క్రిష్ తో ఒక పీరియాడికల్ డ్రామా మూవీ కూడా చేస్తున్న పవన్, దాని అనంతరం గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో కూడా ఒక సినిమా చేయనున్నారు. రేపు పవన్ జన్మదినం సందర్భంగా ఈ మూడు సినిమాల నుండి సర్ప్రైజింగ్ అప్ డేట్స్ రిలీజ్ చేయబోతున్నట్లు ఆయా సినిమాల యూనిట్లు ఇప్పటికే ప్రకటనలు చేసాయి.  

మరోవైపు తమ అభిమాన హీరో జన్మదినాన్ని ఘనంగా నిర్వహించాలని పవర్ స్టార్ ఫ్యాన్స్ ట్విట్టర్ సహా పలు సోషల్ మీడియా మాధ్యమాలను హోరెత్తిస్తున్నారు. ఇటీవల మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా సృష్టించబడ్డ 60.3 మిలియన్ల ట్రెండ్ ని కొద్దిరోజుల క్రితం అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ పేరిట ట్రెండ్ తో ఏకంగా 65 మిలియన్లను సాధించి బద్దలు కొట్టారు పవన్ ఫ్యాన్స్. కాగా కొద్దిసేపటి క్రితం నుండి స్టార్ట్ అయిన పవన్ కళ్యాణ్ బర్త్ డే ట్విట్టర్ ట్రెండ్ తో రేపు ఇంకెన్ని మిలియన్లతో సరికొత్త రికార్డు సృష్టిస్తారో అని అంటున్నారు విశ్లేషకులు ....!!

మరింత సమాచారం తెలుసుకోండి: