గత ఏడాది కరోనా టైం లో విడుదలైన మొట్ట మొదటి ఓటీటీ చిత్రం మన న్యాచురల్ స్టార్ నాని నటించిన 'వి'..సుధీర్ బాబు మరో హీరోగా, దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.. అయితే ఇప్పుడు ఈ సినిమాపై ఓ బాలీవుడ్ నటి కేసు వేయడం సెన్సేషన్ ని క్రియేట్ చేస్తోంది.. తన అనుమతి లేకుండా ‘వి’ సినిమాలో తన ఫొటోను వాడారని ఆరోపిస్తూ సాక్షి మాలిక్ బోంబే హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. ‘సోను కి టిట్టు కి స్వీటీ’ సినిమాలోని ‘బామ్ డిగ్గీ డిగ్గీ’ పాట ద్వారా పాపులర్ అయిన సాక్షి మాలిక్ వేసిన పిటిషన్‌ను విచారించిన బోంబే హైకోర్టు.. ‘వి’ చిత్రం స్ట్రీమింగ్ అవుతోన్న ఓటీటీ ప్లాట్‌ఫాంకు ఆదేశాలు జారీ చేసింది. ఓటీటీ నుంచి తక్షణమే సినిమాను తొలగించాలని.. సాక్షి మాలిక్ అభ్యంతరం తెలిపిన సన్నివేశాన్ని కూడా సినిమా నుంచి తొలగించాలని ఆదేశించింది.నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితీ రావు హైదరి ప్రధాన తారాగణంగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘వి’ లాక్‌డౌన్ సమయంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ద్వారా విడుదలైంది. మొబైల్ ఫోన్‌లో కమర్షియల్ సెక్స్ వర్కర్ ఫొటోను వేరే వ్యక్తికి చూపించే సన్నివేశం ఈ సినిమాలో ఉంది. ఆ ఫొటో తనదేనని సాక్షి మాలిక్ కోర్టుకెక్కారు. దీంతో కోర్టు సినిమా నిర్మాతలకు అక్షింతలు వేసింది. అనుమతి లేకుండా వేరొకరి ఫొటోను, మరీ ముఖ్యంగా ప్రైవేట్ ఇమేజ్‌ను ఎలాబడితే అలా వాడేయడం చట్టవిరుద్ధమని, పూర్తిగా అక్రమమని కోర్టు పేర్కొంది. ఫొటో వాడకాన్ని బట్టి ఇది పరువునష్టం దావా కిందికి కూడా రావచ్చని ధర్మాసనం హెచ్చరించింది.కాగా, ‘వి’ సినిమాను ఇప్పటికే ఓటీటీ ప్లాట్‌ఫాం నుంచి తొలగించారు. కోర్టు ఆదేశాల మేరకు అభ్యంతరకర సన్నివేశాన్ని నిర్మాతలు తొలగించిన తరవాత మాత్రమే మళ్లీ ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి సినిమాను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, అప్‌లోడ్ చేయడానికి ముందు సినిమాను సాక్షికి, ఆమె లాయర్‌కు చూపించాలి. మరోవైపు, సాక్షి ఫొటోను ఒక ఏజెన్సీ నుంచి నిర్మాతలు తీసుకున్నారని.. ఆ ఏజెన్సీ సాక్షి నుంచి అనుమతి తీసుకొని ఉంటుందని వారు భావించారని సమాచారం..ఏదేమైనా అనుమతి లేకుండా వేరే నటిని ఇలా సెక్స్ వర్కర్ గా చూపించడం తప్పని అంటున్నారు విశ్లేషకులు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: