ప్రతి మనిషి జీవితంలో ఉండాల్సింది అదృష్టం. ప్రతిభా పాటవాలు ఎన్ని ఉన్నా కూడా ఆవగింజ అంత లక్ చిక్కకపోతే మాత్రం అన్ని ప్రయత్నాలు వ్యర్ధమే అవుతాయి. దానికి చలన చిత్ర సీమలో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. కొందరిని చూసినపుడు ఇంత టాలెంట్ ఉండి కూడా ఎందుకు ఇలా ఉండిపోయారు అనిపించకమానదు. అలాంటి వారిలో ప్రముఖ నేపధ్య గాయకుడు జి ఆనంద్ కూడా ఉంటారు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆనంద్ మొదటి నుంచి సంగీతం  పట్ల ఆసక్తి కలిగిన వారు. బండారు చిట్టిబాబు వద్ద ఆయన శిష్యరికం చేశారు. ఇక సినీ గాయకుడిగా అవకాశాలు  వెతుక్కుంటూ 1970 దశకంలో మద్రాస్ బాట పట్టారు. ఆయన ఎంతో ప్రయత్నం చేసిన మీదట ఎస్పీ కోదండపాణి సంగీత దర్శకత్వంలో  వచ్చిన పండంటి కాపురం సినిమాలో రాజబాబుకు తొలి పాట పాడారు.  ఆడి పాడే కాలంలోనే అంటూ వచ్చే ఈ పాటలో ఎస్పీ బాలూ, సుశీలతో కలసి ఆనంద్ మొదటి సారి గొంతు కలిపారు.

ఆ మీదట ఆనంద్ ప్రతిభను గుర్తించి మొదట్లో కొన్ని అవకాశాలు ఇచ్చింది నాటి ప్రఖ్యాత సంగీత దర్శకుడు జీకే వెంకటేష్. అమెరికా అమ్మాయి సినిమాలో ఒక వేణువు వినిపించెను అన్న సాంగ్ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోతుంది. ఈ పాట నేను ఎందుకు పాడలేకపోయాను అని గాన గంధర్వుడు బాలూ ఎంతో బాధపడ్డారు అంటేనే ఆ పాట మాధుర్యం   ఏంటో అర్ధమవుతుంది. ఇక జీకే వెంకటేష్ మ్యూజిక్ డైరెక్షన్ లోనే వచ్చిన చక్రధారి సినిమాలో విఠలా విఠలా పాండురంగ విఠలా అన్న‌ పాటను ఆనంద్ పాడారు. ఇది నాటి రికార్డుల్లో ఉంది కానీ సినిమాలో మాత్రం బాలూ తో పాడించారు. అలా ఆనంద్ కి మంచి పాట వచ్చినా పేరు మాత్రం లేకుడా పోయింది.

బంగారక్క సినిమాలో ఆనంద్ పాడిన  దూరాన దూరాన  తారాదీపం అన్న సాంగ్ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఆనంద్ అక్కినేని నాగేశ్వరరావు కి కూడా ఒక సినిమాలో పాడారు, కానీ సినిమాలో మాత్రం ఆ పాట లేకుండా పోవడం దురదృష్టకరమే. బంగారు కానుక సినిమాలో ప్రేమ బృందావనం అన్న సాంగ్ సూపర్ హిట్. సినిమాలో ఆ పాట ఉంటే ఆనంద్ అగ్ర స్థాయికి చేరే వారే. అక్కడా బ్యాడ్ లక్ ఎదురైంది. ఆనంద్ ఎక్కువగా మురళీమోహన్, చంద్రమోహన్ వంటి వారికే పాడారు. ఇక ఆయన ప్రాణం ఖరీదు మూవీలో చిరంజీవికి తొలిసారి గాత్రదానం చేసి మెగాస్టార్ కి తీపి గురుతు మిగిల్చారు.  ఆనంద్ గొంతు బాగుంటుంది. ఆయన పాటలో ఒక మత్తు ఉంది. కానీ లేనిది  మాత్రం అదృష్టం. అందుకే ఆయన నాటి అగ్ర కధానాయకులకు పాడలేకపోయారు. మంచి అవకాశాలు కూడా రాకుండా పోయాయి అని ఆయన అభిమానులు బాధపడుతూంటారు.







మరింత సమాచారం తెలుసుకోండి: