సాధారణంగా సినిమాలకి సంబంధించి కొన్ని సన్నివేశాల్లో నటించడానికి నటీనటులు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. హత్య, అత్యాచారాలు, చిత్రహింసలు పెట్టడం, ఘాటైన రొమాంటిక్ సీన్లలో నటించడం వంటివి ఎంత అనుభవం ఉన్న నటీనటులకు అయినా కాస్త ఇబ్బందిని కలగచేస్తాయి. వాస్తవానికి ఒక సన్నివేశం షూట్ చేసే సమయంలో చుట్టూ వందల మంది గుమిగూడతారు. కెమెరాలు, లైట్ లు ఇలా ప్రతి ఒక్కటి నటీనటులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అయితే ఇదే విషయాన్ని ప్రతినాయకుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒక రేపు సన్నివేశం చిత్రీకరణ సమయంలో తాను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యానని ఆయన ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.


వివరంగా తెలుసుకుంటే.. దివంగత నటుడు శ్రీహరి, సుహాసిని మణిరత్నం, పూర్ణ తదితరులు నటించిన "శ్రీ మహాలక్ష్మి(2007)" సినిమాకి ఫైట్ మాస్టర్ విజయన్ దర్శకత్వం వహించారు. 2006లో విడుదలైన "చింతామణి కోలాకేస్" అనే మలయాళం సినిమాకి రీమేక్ గా శ్రీ మహాలక్ష్మి సినిమాని రూపొందించారు. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక సన్నివేశం చాలా ఇబ్బంది పెట్టిందని అజయ్ వివరించారు.



ఆయన ఇంటర్వ్యూయర్ తో మాట్లాడుతూ.. " డైరెక్టర్ విజయన్ ఒక రేప్ షూట్ లో నటించాలని నాకు సూచించారు. దీంతో నేను సరే అని చెప్పి.. రేప్ సీన్ కి రెడీ అయిపోయాను. ఆ సన్నివేశం కోసం అప్పటికే ఒక మోడల్ ని తెచ్చారు కానీ ఆ అమ్మాయికి రేప్ సన్నివేశం ఉంటుంది అని చెప్పలేదు. డైరెక్టర్ మాత్రం 'రెడీ... స్టార్ట్... యాక్షన్..!' అని అన్నారు. ఆ మాటలు వినగానే.. అదేమిటి.. సార్, అంటూ నేను విభ్రాంతికి గురయ్యాను. కనీసం ఆ మోడల్ కి రేప్ సీన్ ఉంటుందని కూడా చెప్పకపోవడం అన్యాయం, సార్.. అని నేను అన్నాను. నా మాటలు విని ఆ మోడల్ బోరున ఏడవటం మొదలు పెట్టింది. దీంతో నావల్ల కాదు.. నేను చేయలేను, సార్.. ఇదెక్కడి గొడవ సార్ నాకు అని నేను డైరెక్టర్ తో చెప్పాను... "




"ఆ సమయంలో ఆ అమ్మాయి ఏడవటం చూస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. వందల మంది యూనిట్ సభ్యుల ముందు ఇలాంటి సన్నివేశాలు చేయడానికి చాలా చిరాగ్గా, ఇబ్బందిగా ఉంటుంది. అదృష్టవశాత్తు ఇలాంటి సన్నివేశాలు చేసే అవసరం నాకు ఎక్కువగా రాలేదు" అని అజయ్ చెప్పుకొచ్చారు. ఇకపోతే అజయ్.. చిరంజీవి-కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న ఆచార్య సినిమాలో సహాయ నటుడిగా కనిపించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: