క‌రోనాతో గ‌తేడాది నెలల తరబడి థియేటర్లు మూతప‌డిన సంగ‌తి తెలిసిందే. అవి ఎప్పటికి తెరుచుకుంటాయో తెలియని అయోమ‌య ప‌రిస్థితుల్లో కొందరు నిర్మాతలు తమ చిత్రాలను ఓటీటీల్లో విడుద‌ల చేశారు. ఎగ్జిబిటర్ల నుంచి వ్యతిరేకత వ‌చ్చినా ఎవ‌రూ వెన‌క్కి త‌గ్గ‌లేదు. వి, నిశ్శబ్దం లాంటి సినిమాలు ఓటీటీలోనే విడుద‌ల‌య్యాయి. ఒక దశలో ఎగ్జిబిటర్లు కూడా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. వారి నుంచి అంత‌గా వ్యతిరేకత కూడా రాలేదు. అయితే క‌రోనా రెండోద‌శ‌లో మాత్రం ఎగ్జిబిటర్ల స్పందన ఇంకోలా మారింది. ఇప్పటికే ధియేటర్ ప‌రిశ్ర‌మ బాగా దెబ్బ తిన్న నేపథ్యంలో నిర్మాతలు మంచి సినిమాలను ఓటీటీలకు భారీ ధ‌ర‌ల‌కు ఇచ్చేసి వెండితెరకు అన్యాయం చేస్తున్నారంటూ వారిలో ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

తాడో పేడో తేల్చుకోవ‌డానికి సిద్ధ‌మైన ఎగ్జిబిట‌ర్లు
ఈసారి మాత్రం తాడో పేడో తేల్చుకోవడమే అన్నట్లుగా ఎగ్జిబిటర్లు ఉన్నారు. నిర్మాతలతో పోరాటానికి సిద్ధ‌మ‌య్యారు. నిర్మాతలు దారికి రాకుంటే థియేటర్లు మూసేస్తామ‌ని, వాటిని వేరే వాణిజ్య ప్ర‌యోజ‌నాల‌కు ఉప‌యోగించుకుంటామ‌ని  నిర్మాతలకు తేల్చి చెప్పేసినట్లు స‌మాచారం. ఇప్పుడు దారికి రాకుంటే సాధారణ పరిస్థితుల్లో థియేటర్ల కోసం పోటీ ఉన్న‌ సమయంలో అప్పుడు మీ సంగ‌తి చూస్తామ‌ని, ఇంత‌కు ఇంత బ‌దులు తీర్చుకుంటామ‌ని హెచ్చ‌రించిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఓటీటీ డీల్స్ చేసుకునేవారు.. ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్న‌వారు వెనక్కి తగ్గుతున్నట్లు స‌మాచారం. సురేష్ బాబు లాంటి అగ్ర నిర్మాత సందిగ్ధంలో ఉన్నార‌ని, నితిన్ ‘మాస్ట్రో’ విషయంలోనూ ఓటీటీకి వెళ్ల‌డంలేదంటున్నారు. ఎగ్జ‌బిట‌ర్లు గట్టిగా నిల‌బ‌డితే పేరున్న క‌థానాయ‌కుల సినిమాలేవీ, మంచి అంచ‌నాల‌తో రూపొందించిన సినిమాలేవీ ఓటీటీకి వెళ్లే అవ‌కాశం క‌న‌ప‌డ‌టంలేద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలంటున్నాయి.  అయితే సురేష్‌బాబు నిర్మించిన నార‌ప్ప‌, దృశ్యం-2 ఓటీటీల్లో విడుద‌ల చేయ‌డంపై ఒప్పందాలు కుదిరాయ‌ని, అమెజాన్ ప్రైమ్ నార‌ప్ప‌కు సంబంధించి ప్ర‌క‌ట‌న‌లు కూడా సిద్ధం చేసుకుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై నిర్మాత సురేష్‌బాబు ఇంత‌వ‌ర‌కు పెద‌వి విప్ప‌డంలేదు. ఈ విష‌యంలో మాత్రం ఎగ్జిబిట‌ర్లంతా గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. చేతిలో ధియేట‌ర్లు ఉన్న నిర్మాతే త‌న సినిమాల‌ను ఓటీటీల‌కు ఇస్తే త‌మ ప‌రిస్థితి ఏమిట‌ని వారంతా నిల‌దీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag