తెలుగు సినిమా కొద్దిగా మార్పు చెందుతోంది. నిచ్చెన మెట్ల కుల సంస్కృతిని బతికించాలనే తాపత్రయంతో వదులుతున్న సినిమా బాణాలను జనం పసిగట్టారని తెలుసుకుంటున్నారో ఏమో.. ఇప్పుడు సమాజంలో జరుగుతున్న తప్పులను ఎత్తిచూపుతున్నారు. ఈకోవలోనే కరుణకుమార్ దర్శకత్వంలో  ‛శ్రీదేవి సోడా సెంటర్’ ను తెరకెక్కించారు. ఇందులో సుధీర్ బాబు, ఆనంది హీరోహీరోయిన్లుగా నటించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నేపథ్యంలో కథను నడిపించారు. ఇందులో హీరో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తాడు. జాతరలో విద్యుత్ లైట్లు అమర్చే పనులతో పాటు అక్కడ సోడాల దుకాణపు యజమాని సంజీవరావు(నరేశ్) కూతురు శ్రీదేవి(ఆనంది)కి సైటు కొడుతుంటాడు. తరువాత వారి మధ్య ప్రేమ పుడుతుంది. వాళ్ల ఇద్దరి మధ్య ప్రేమకు కులం అడ్డు పడుతుంది. అది ప్రాణాలకు చిచ్చు పెడుతుంది. విలన్ పన్నాగాలు, హీరో మీద హత్య కేసులు నమోదు కావడం, జైలుకు వెళ్లడం, జైలు నుంచి తిరిగి రావడం, ప్రేమ కోసం హీరోయిన్ చుట్టూ తిరగడం, అప్పటికే ఆమె జీవితంలో జరగాల్సిన పరిణామాలు జరిగిపోతూ కథ సాగుతుంది. రొటీన్ కథ అనిపించినా కొంత భిన్నంగానే ఉంది. 

హీరోయిన్ ను పోకిరీలు ఏడిపిస్తుంటే హీరో వచ్చి వారితో ఫైట్ చేసే సినిమాలు చాలా ఉన్నాయి. అయితే ఆడపిల్లలు తమను తాము రక్షించుకోగలరనే ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం, విలన్లను కొట్టగలిగే ధైర్యం గలవారిగా చూపడం ఇప్పటి సినిమాల్లో కనిపిస్తుంది. ధైర్యం గల హీరోయిన్ పాత్ర, ఆ పాత్రకు తగిన హావభావాలతో ఆకట్టుకుంది. హీరోయిన్ తండ్రిగా నరేశ్, హీరో స్నేహితుడిగా సత్యం రాజేశ్ తమ నటనతో మెప్పించారు. సమాజంలోని మూఢత్వాలు, రుగ్మతలను చెంపదెబ్బ కొట్టినట్టుగా మలయాళం సినిమాలే చూపిస్తాయని నమ్ముతున్న ప్రేక్షకులు, తెలుగు సినిమా కూడా అలా మారుతోందనుకునేలా ఉంది. తరం మారిందంటూ హీరోయిన్ తండ్రితో మాట్లాడే డైలాగ్స్ బాగున్నాయి. కూతురు ప్రేమను తండ్రి అంగీకరించినా, పెండ్లికి ఒప్పుకోకపోవడానికి సమాజం ఇలా అనుకుంటుందని భయపడిన తండ్రి పాత్ర సోకాల్డ్ సమాజాన్ని దెబ్బ కొట్టింది. మొత్తానికి ఈ సినిమా సమాజంలోని లోపాలను ఎత్తిచూపింది. కన్న కూతురు మీద ప్రేమను పరువుకు ముడిపెడుతూ, కులం విషయంలో ఎలా తెగిస్తున్నారో తండ్రి పాత్ర కండ్లకు కట్టించింది. కులం, పరువు వంటి సమాజపు చీడలు మనిషిని ఎంతగా దిగజార్చుతున్నాయో ఈ పాత్ర చూపించింది. ఇది ఆ మధ్య జరిగిన పరువు హత్య కేసులో నిందితుడు మారుతీరావును తలపిస్తుంది. తరువాత పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకోవడం మరింత దగ్గరగా అనిపిస్తుంది. 

సినిమాలో గోదావరి యాస సహజంగా అనిపింస్తుంది. జానపదాలకు మేకప్ తొడిగితే జనాదరణ వస్తోంది. అదే బాటలో ఈ సినిమాలో కూడా ‛మందులోడా ఓరి మాయలోడా’ పాట మాస్ ప్రేక్షకులకు అలరిస్తుంది. మణిశర్మ సంగీతం బాగానే ఉంది. అజయ, హర్షవర్ధన్, రఘుబాబు, సప్తగిరి, రోహిణి తదితరులు పాత్రల మేరకు బాగా నటించారు. గతంతో పోలిస్తే సుధీర్ బాబు నటన స్థాయిని పెంచి, ఆకట్టుకున్నారు. సాధారణ ఎలక్ట్రీషియన్ పాత్రలో సిక్స్ ప్యాక్ చూపించడం అవసరం లేదనిపించింది. కొన్ని సన్నివేశాలు ముందుగానే ఊహించినట్టు అనిపించినా, ఈ సినిమాకు క్లైమాక్స్ ప్రాణం పోసింది. మొత్తానికి శ్రీదేవి గోలిసోడా బాగానే పేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: