కుర్రకారులో హుషారు నింపే కథలతో యూత్ లో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్.  'పెళ్లిచూపులు' అనే సినిమా ద్వారా జాతీయ పురస్కారం కూడా అందుకున్నారు. మంచి దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నారు. ఇక ఆయనలో ఉత్తమ రచయితేకాదు.. ఉత్తమ నటుడు కూడా దాగి ఉన్నాడు. అందుకే ఈ డైరెక్టర్ తో ఇద్దరు హీరోలు నటింపజేశారు. విశ్వక్‌ సేన్ 'ఫలక్‌నుమా దాస్'లో సపోర్టింగ్ రోల్ ఇస్తే, విజయ్ దేవరకొండ లీడ్‌ రోల్‌లో సినిమా తీశాడు. విజయ్ నిర్మాణంలో వచ్చిన 'మీకు మాత్రమే చెప్తా' సినిమాలో తరుణ్ భాస్కర్‌ కథానాయకుడిగా మెప్పించాడు. అంతేకాదు తరుణ్ భాస్కర్‌ నటన..దర్శకత్వంలోనే కాదు పాటలు కూడా ప్రయత్నం చేశాడు. వెబ్ ఫిల్మ్ 'సినిమా బండి'లో సినిమా తీసినం అనే పాట పాడి అలరించాడు. అలాగే ఒక టాక్‌ షోకి హోస్టింగ్ కూడా చేస్తూ తనలోని విభిన్న కోణాలను పరిచయం చేస్తున్నాడు.  

ఇక శివ నిర్వాణ విషయానికొస్తే.. ఎమోషనల్‌ డ్రామాస్‌తో సూపర్ హిట్స్ కొట్టాడు. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథలు తీశాడు. తాజాగా లిరిక్ రైటర్ కమ్ సింగర్‌గా మరో కోణం చూపించాడు. నానితో తీసిన 'టక్ జగదీష్' సినిమాలో టక్ సాంగ్ రాయడమే కాదు.. పాట కూడా పాడాడు. సినిమా అంటేనే క్రియేటివ్ వరల్డ్. అవకాశం దొరకడం ఆలస్యం దర్శకులు తమలోని టాలెంట్ చూపిస్తున్నారు. చాలారోజులుగా దాచిపెట్టిన ప్రతిభని వెండితెరకెక్కిస్తున్నారు.

మరోవైపు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతిలో ఎందరో హీరోలు స్టార్ హీరోలుగా ఎదిగారు. మహేశ్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ కిడ్స్‌ని లాంచ్ చేశాడు. కమర్షియల్ మూవీస్‌కి కొత్త రంగులద్దిన ఈ దర్శకుడు ఇప్పుడు యాక్టర్‌గా మారాడు. 'పెళ్లి సందఢి' సినిమాలో కీ-రోల్ ప్లే చేస్తున్నాడు రాఘవేంద్రరావు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోణంకి డైరెక్షన్‌లో వస్తోంది 'పెళ్లి సందఢి'. నాటి 'పెళ్లి సందడి' స్టార్ శ్రీకాంత్ కొడుకు రోషన్‌ హీరోగా లాంచ్ అవుతోందీ సినిమా. ఇక ఈ మూవీతోనే దర్శకేంద్రుడు కూడా యాక్టర్‌గా లాంచ్ అవుతున్నాడు. ఇక డైరెక్టర్ వివేక్ ఆత్రేయ 'మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా' సినిమాలతో మంచి హిట్స్ కొట్టాడు. ప్రస్తుతం నానితో 'అంటే సుందరానికి' అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ డైరెక్టర్ ఫిల్మ్ మేకింగ్‌తో పాటు, పాటలు కూడా రాస్తున్నాడు. ఇప్పటికే మెంటల్ మదిలో 'గుమ్మడికాయ హల్వా, ఊహలే' పాటలతో పాటు ఈ నగరానికి ఏమైంది సినిమాలో 'మారే కలలే.., వీడిపోనిది ఒకటేలే' అనే పాటలు రాశాడు. మొత్తానికి దర్శకులు తమలోని టాలెంట్ ను సందర్భాన్ని బట్టి ప్రదర్శిస్తూ ప్రేక్షక లోకాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: