దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో వెండి తెరకు ఎక్కిన చిత్రం కొండపొలం. ఈ మూవీలో హీరో వైష్ణవ్‌ తేజ్‌, హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయకుడు, నాయికలుగా నటించారు. ఉప్పెన చిత్రంతో మంచి విజయం సొంతం చేసుకున్న వైష్ణవ్‌ తేజ్‌కు.. తన తాజా చిత్రం కొండ పొలం కూడా కెరీర్‌లో మంచి సినిమాగా నిలిచిపోతుందన్న అభిప్రాయాలు ప్రేక్షకుల్లో వ్యక్తమవుతున్నాయి. నిజానికి కొండపొలం చిత్రం నవల ఆధారంగా నిర్మితమైంది. ప్రకృతి అందించే ఆత్మవిశ్వాసంతో, జీవితంలో గెలిచిన యువకుడి జీవనాన్ని ఇతివృత్తంగా తీసుకుని నిర్మించిన కొండపొలం మూవీ.. యువజన పాఠంగా, స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

నవలా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి తానా అవార్డు పొందారు. ఆయన స్వయంగా సినిమా కథ రాశారు. నవలలో లేని ఓబులమ్మ క్యారెక్టర్‌ను కొత్తగా తీర్చిదిద్దారు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి మాటల్లోనే కాకుండా.. ఆయన చేతి నుంచి జాలువారిని అక్షరం కూడా గుండెకు హత్తుకునేలా ఉంటుందనీ, మాతృభాషలో మాట్లాడితే మనసుకు చేరుతుందనీ అభిమానులు అంటుంటారు. కొండపొలంలో బలమైన సంభాషణలు సినిమా దశ దిశను మార్చేలా ఉన్నాయని, వాటిలో ఎంత గాఢత ఉందన్న టాక్‌ వినిపిస్తోంది.

కొండ పొలం నవల చదువుతుంటే ఉండే ఉత్కంఠను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరపై చూపడానికి చాలా ప్రయత్నించారు. హీరో వైష్ణవ్ తేజ్ రవీంద్ర యాదవ్ అనే యువకుడి పాత్రను పోషించాడు. కడప జిల్లా వాసి అయిన పాతికేళ్ల యువకుడు రవీంద్ర యాదవ్‌.. బీటెక్‌ కంప్లీట్‌ చేసి..హైదరాబాద్‌లో జాబ్‌ కోసం చాలా ట్రై చేస్తాడు. ఎంతకూ ఉద్యోగం దొరక్కపోవడంతో.. ఇక హైదరాబాద్‌లో బతకడమనేది కష్టంగా అనిపించి తన గ్రామానికి వెళతాడు.

సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు కొండ పొలం సినిమాలో కీలక పాత్ర పోషించారు. రవీంద్ర యాదవ్‌కు తాతగా నటించాడు. కోట శ్రీనివాసరావు రోశయ్య పాత్రలో గొర్రెలను కొండ పొలంకు వెళ్లి రమ్మని చెప్పడం, హీరోయిన్‌ సహాయం, అడవిలో నేర్చిన గుణపాఠాలతో రవీంద్ర యాదవ్‌ సివిల్‌ సర్వంట్‌గా విజయం సాధించడం వంటి సన్నివేశాలను దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి చాలా హృద్యంగా తెరకెక్కించారు.

వైష్ణవ్ తేజ్ కొండ పొలం సినిమాలో తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. ఆ పాత్రకు ప్రాణం పోశాడు. ఉప్పెన సినిమాలో సముద్రపు ఒడ్డున నటన నేర్చుకున్న వైష్ణవ్‌.. కొండ పొలం చిత్రంలో అడవి యందు దాన్ని మరింత మెరుగు పర్చుకున్నట్లుగా కనిపిస్తోంది. సినిమాలో తొలుత భయస్థుడిగా ఉన్న రవీంద్ర యాదవ్‌.. ఆ తరువాత కృషి, పట్టుదలతో కష్టపడే విధానం చాలాబాగా ఆకట్టుకునేలా ఉంది.

అలాగే రకుల్‌ ప్రీత్‌ క్యారెక్టర్‌.. వైష్ణవ్‌ తేజ్‌ను డామినేట్‌ చేసినట్లుగా కనిపిస్తుంది. రకుల్‌పై డ్రగ్స్‌ ముద్ర చెరిగేలా బాగా అభినయించిందన్న టాక్‌ వినిపిస్తోంది. ఇక మిగతా నటీనటులు అందరూ తమ పాత్రల్లో రాణించి మెప్పించారు. సినిమాలోని పాటలు యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా కొండ పొలం సినిమా సక్సెస్‌ దిశగా దూసుకెళుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: