మాస్ మహారాజా అన్నారు కానీ కామెడీ మహారాజా అనాలి. ఎందుకంటే ఆయన వెండితెరపై ఆ రేంజ్ లో నవ్వించగలడు. కానీ కామెడీ మహారాజా అంటే స్టార్ రేంజ్ ఉండదు అనుకున్నారేమో. అంతేకాకుండా హీరో అన్నాక మాస్ సపోర్ట్ తప్పనిసరి. లేదంటే వాళ్ళు సినిమాలు తీసినప్పుడు ఈలలు వేసేది ఎవరు ? గోళాలు చేసేది ఎవరు ? అందుకే మాస్ మహారాజా అన్నారేమో రవితేజను. మాస్ అయినా కామెడీ అయినా రవితేజకు కొట్టిన పిండి. ఆయన కామెడీ చేసినా, సపోర్టింగ్ రోల్స్ నటించే కమెడియన్లపై సెటైర్లు వేసినా నవ్వాగదు. రవి తేజ సినిమా అంటే థియేటర్లకు రప్పించే విషయాల్లో ఇదొకటి.

ఇడియట్, ఖడ్గం, ఈ అబ్బాయి చాలా మంచోడు, అమ్మా నాన్నతమిళ అమ్మాయి, వెంకీ, భద్ర, విక్రమార్కుడు, దుబాయ్ శీను, కృష్ణ, బలాదూర్, కిక్, ఆంజనేయులు, డాన్ శీను, మిరపకాయ్, దరువు, పవర్, రాజా ది గ్రేట్, క్రాక్... ఇలా కెరీర్ మొదటి నుంచీ ఆయన నటించిన చాలా సినిమాలూ కామెడీ బేస్ తో తెరకెక్కినవే. అయితే రవితేజ క్రేజ్ కు తగ్గుట్లుగా దర్శకులు కామెడీకి యాక్షన్ ను కూడా జోడించడం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అందుకే రవితేజతో యాక్షన్ హీరోనూ చూడగలిగాం. ఇప్పటికీ ఆయన సినిమా వస్తుందంటే కామెడీని ఖచ్చితంగా ఆశిస్తారు ప్రేక్షకులు.

ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రమేష్ వర్మ  దర్శకత్వంలో "ఖిలాడీ", శరత్ మండవ దర్శకత్వంలో "రామారావు ఆన్ డ్యూటీ" అనే రెండు డిఫరెంట్ జోనర్లలో రూపొందుతున్న సినిమాల్లో నటిస్తున్నారు. అయితే ఆ రెండు ఇంకా షూటింగ్ పూర్తి కాకముందే మరో సినిమాకు కూడా రవితేజ సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. "ఖిలాడీ" టీజర్ ఇటీవల విడుదలై ఆకట్టుకుంది. ఇక "రామారావు ఆన్ డ్యూటీ" పోస్టర్ తోనే ఆసక్తిని పెంచేసింది. త్వరలోనే "ఖిలాడీ"గా థియేటర్లలోకి రానున్నారు రవితేజ.    


మరింత సమాచారం తెలుసుకోండి: