మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. మరో 24 గంటల్లో విజేత ఎవరో తేలిపోతుంది. ఆదివారం సాయంత్రానికి సంబరాలు కూడా మొదలయిపోతాయి. దాదాపు మూడు నెలలుగా జరుగుతున్న మా ఎన్నికల పోరు తుది దశకు చేరుకుంది. రేపు ఉదయం పోలింగ్ ప్రక్రియ... రేపు మధ్యాహ్నం కౌంటింగ్... రేపు సాయంత్రం విజేత ప్రకటన. అన్ని చకచకా జరిగిపోతాయి. ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో తలపడుతున్న ఇద్దరు అభ్యర్థులు కూడా ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ మధ్య జరగాల్సినంతా జరిగిపోయింది. అయితే మా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రవేశం... సర్వాత్రా ఆసక్తిగా మారింది. సాధారణంగా సినీ ప్రముఖులు రాజకీయాల్లో చేరడం సర్వ సాధారణం. కానీ రాజకీయ నేతలు... సినిమాల వ్యవహారాల్లో మాత్రం ఎలాంటి జోక్యం చేసుకోరు.

కానీ ప్రస్తుత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మాత్రం రాజకీయ పార్టీలు నేరుగా జోక్యం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా మంచు విష్ణు గెలుపు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు... భారతీయ జనతా పార్టీ నేతలు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు. మంచు విష్ణు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి బంధువు. వైఎస్ఆర్ సోదరుని కుమార్తెను విష్ణు ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు విష్ణు బావ అవుతారు. అలాగే ఆ ప్యానల్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థి పృధ్వీరాజ్ బాల్‌రెడ్డి కూడా వైసీపీకి చెందిన వ్యక్తి. ఇక మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యులుగా ఉన్నారు. ఒక దశలో జగన్ ఓటు వేస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే మా ఎన్నికలతో వైఎస్ జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని మంత్రి పేర్ని నాని స్వయంగా ప్రకటించారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా తన ఓటు విష్ణు ప్యానల్‌కే అంటూ ప్రకటించింది. అటు బీజేపీ నేతలు కూడా విష్ణు కోసం పని చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం గతంలో మోదీ సర్కార్‌ తీరుపై ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలే. మోదీ ప్రభుత్వాన్ని తప్పుబడుతూ... ఎంపీగా కూడా పోటీ చేశారు ప్రకాశ్ రాజ్. దీంతో... ప్రకాశ్ రాజ్ ఓటమి కోసం బీజేపీ నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

MAA