మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. మంచు విష్ణు దాదాపుగా 107ఓట్ల భారీ మెజారిటీతో ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ పై గెలుపొందారు. దాదాపుగా రెండు నెలల సుదీర్ఘ పోరాటం అనంతరం మంచు విష్ణు ఈ గెలుపును కైవసం చేసుకున్నారు. 'మా' ఎన్నికలలో గెలిచిన మంచుకి విష్ణుకు ఇప్పుడు అభినందనలు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులందరూ విష్ణుకు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. అధ్యక్ష పదవికోసం పోరాడిన ప్రకాష్ రాజ్ సైతం.. విష్ణుకు తన శుభాకాంక్షలు తెలిపి.. హుందాతనాన్ని ప్రదర్శించారు. ఈ విజయం తన ఒక్కడి విజయమే కాదని.. అందరి సమష్టి కృషి కారణంగానే విజయం సాధ్యమైందని చెప్పారు మంచు విష్ణు.

మంచు 'మా' అసోసియేషన్ ఎన్నికలలో గెలిచిన అనంతరం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలుస్తారని తెలుస్తోంది. సీఎం జగన్ ఆయనకు బంధువు కూడా కావడంతో అధ్యక్షహోదాలో తొలిసారిగా కలవబోతారని తెలుస్తోంది. సీఎంను కలిసి.. ఇండస్ట్రీలోని సమస్యలు.. వాటికి పరిష్కారాలు కూడా ఆలోచించేదిశగా మంచు విష్ణు అప్పుడే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టేశారని టాక్. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ ను కూడా మంచు విష్ణు కలుస్తారని సమాచారం.. ఇందుకోసం అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ అయిందని అంటున్నారు. ఇండస్ట్రీ హైదరాబాద్ లోనే ఉండటంతో ఏపీతో పాటూ తెలంగాణ ప్రభుత్వాల సహకారం కూడా 'మా' అసోసియేషన్ కు ఎంతో అవసరం. అందుకే మంచు విష్ణు ఆలస్యం చేయకుండా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలను కలిసేందుకు సిద్దమయిపోతున్నారు.

ఇక నుంచి టాలీవుడ్ కు సంభందించి ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరిగినా.. వాటిలో మంచు విష్ణు కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో ఎప్పుడు చర్చలు జరిగినా.. చిరంజీవి, నాగార్జునతో పాటూ కొందరు నిర్మాతలు మాత్రమే కనిపించేవారు. అయితే ఇప్పుడు మా అధ్యక్ష పీఠాన్ని మంచు విష్ణు కైవసం చేసుకోవడంతో పద్ధతి మారనుంది. ఇందుకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ మొత్తాన్ని మోహన్ బాబు ఇప్పటికే సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇకపై ప్రభుత్వాలతో జరిగే చర్చల్లో 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు, సీనియర్ నటుడిగా మోహన్ బాబు కీలకం కాబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: