రష్మిక మందన్నా మొన్నటి వరకు మోడ్రన్ లుక్‌లోనే కవ్వించింది. అయితే తొలిసారి 'పుష్ప' సినిమా కోసం బ్రౌన్‌ మేకప్‌ వేసుకుంది రష్మిక. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో శ్రీవల్లి అనే గ్రామీణయువతిగా నటించింది.
ఇక పూజా హెగ్డే పేరు వినిపించగానే కుర్రాళ్లకి గ్లామరస్‌ భామగానే కళ్లముందు కనిపిస్తుంది. 'డీజే'లో బికినీ పోస్టర్లు, 'అల వైకుంఠపురములో' అల్ట్రామోడ్రన్‌ డ్రస్సులతో అదరగొట్టిన జిగేలురాణి గుర్తుకొస్తుంది. అయితే ఇప్పుడు 'ఆచార్య'లో నీలాంబరి అనే పల్లెపడుచుగా కనిపిస్తోంది. ఇంతకుముందు 'గద్దలకొండ గణేష్'లో కూడా లంగాఓణీల్లోనే కనిపించింది పూజ.

సాయి పల్లవి రెగ్యులర్ కమర్షియల్‌ సినిమాలకి కొంచెం దూరంగానే ఉంటుంది. 'ఫిదా' నుంచి స్ట్రాంగ్ రోల్స్‌ ప్లే చేస్తోన్న పల్లవి 'విరాటపర్వం'లో కూడా ప్రామినెంట్‌ రోల్ ప్లే చేస్తోంది. విప్లవకారుడిని ప్రేమించి, ఆ ప్రేమని వెతుక్కుంటూ అడివిబాట పట్టిన పల్లెటూరి పిల్లగా నటించింది సాయి పల్లవి. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా వస్తోన్న సినిమా 'భీమ్లానాయక్'. మళయాళీ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నిత్యామీనన్‌ అడవి బిడ్డగా నటించింది.

ఇక రకుల్ ప్రీత్ సింగ్ విషయానికొస్తే .. ఈ భామ ఫిట్‌నెస్‌ తో అల్ట్రామోడ్రన్ క్యారెక్టర్స్‌తోనే యూత్‌కి దగ్గరైంది. పరేషాన్‌రా అంటూ బీచ్‌లో డాన్సులు చేస్తే థియేటర్స్‌లో విజిల్స్‌ పడ్డాయి. ఇలాంటి ఇమేజ్‌ ఉన్న రకుల్‌ 'కొండపొలం'లో పల్లెటూరి పిల్లగా నటించింది. గొర్లకాపరి పాత్రతో కొత్తగా ప్రయత్నించింది. అయితే ఈ సినిమా ఆడియన్స్‌కి పెద్దగా కనెక్ట్‌ కాలేదు. దీంతో రకుల్‌ బ్రౌన్ మేకప్‌కి కష్టానికి సరైన గుర్తింపు దక్కలేదనే చెప్పొచ్చు. నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'టక్‌ జగదీష్'. ఈ సినిమాలో హీరోయిన్ రీతూ వర్మ వి.ఆర్.వో. గుమ్మడి వరలక్ష్మిగా నటించింది. ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో రీతు పాత్రకి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. మొత్తానికి మన హీరోయిన్లు పట్నాన్ని వదిలి పల్లె బాట పట్టారు. లంగాఓణీల్లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే పనిలో పడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: