ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఊరకే కాలేదు. మూడు వందలకు పైగా సినిమాలు కూడా అంత ఈజీగా చేయలేదు. ఇక అన్ని జానర్లలో మూవీస్ చేయడం జనాలకు మెప్పించడం, అన్నిటికంటే మిన్నగా రాముడుగా, క్రిష్ణుడిగా అలరించడం అంటే అది సామాన్య విషయం కాదు.

మరి దానికంతటికీ కారణం పెద్దల అశీర్వాదాలే. పైపెచ్చు తీర్చిదిద్దిన గురువులు. ఎన్టీయార్ కి తెలుగు భాష మీద పట్టుంది. ఆయన తెలుగు అంటే బాగా ప్రేమిస్తారు. మరి ఆయనకు కళాశాల రోజుల్లో తెలుగు చెప్పిన వారుఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. కవిసమ్రాట్టు విశ్వనాధ సత్యనారాయణగారు.  ఆయన జ్ఞానపీఠ అవార్డు విజేత. సాహితీ మూర్తి, ఆధునిక తెలుగు సాహిత్యానికి ఆయన నిలువెత్తు రూపం.

అలాంటి గురువుగారు ప్రోత్సాహంతో కాలేజీ రోజుల్లో ఎన్టీయార్ నాయకురాలు నాగమ్మ నాటకంలో నాగమ్మగా పాత్ర పోషించారు. అలా నటనలో మెలకువలు కూడా గురువు నుంచి అందుకున్నవే. అందుకే విశ్వనాధ వారు అంటే ఎన్టీయార్ కి ఎంతో ప్రేమ. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. విశ్వనాధ వారు రచించిన నవల ఏకవీర సినిమాగ తీస్తే అందులో హీరో ఎన్టీయార్. ఇక విశ్వనాధవారిది విజయవాడ, ఎన్టీయార్ ది అదే జిల్లా. దాంతో వీలు దొరికినపుడల్లా గురువుగారిని దర్శించుకుంటూ ఉండేవారు. అంతే కాదు తన సినిమా ఫంక్షన్లు ఏవైనా జరిగితే విజయవాడలో పెట్టమని నిర్మాతలను కోరేవారు, దానికి ముఖ్య అతిథిగా విశ్వనాధ వారిని పిలిచేవారు.

ఇక ఘంటసాల చివరి రోజుల్లో గానం చేసిన భగవద్గీత గ్రామ‌ ఫోన్ రికార్డులను ఆవిష్కరించేందుకు ఎన్టీయార్ ని ఆహ్వానిస్తే ఆయన విజయవాడలో ఆ కార్యక్రమం పెట్టమని కోరారు, తొలి రికార్డుని తన గురువు గారు విశ్వనాధ వారికి ఇవ్వాలని ఆయన ఉద్దేశ్యం. ఆ సభకు వచ్చిన విశ్వనాధ వారు శిష్యవాత్సల్యం ఎంతగానో చూపిస్తే ఎన్టీయార్ గురు భక్తిని మరోమారు చాటుకున్నారు. ఇలా విశ్వ‌నాధ వారు దివంగతులు అయ్యేంతవరకూ ఈ బంధం కొనసాగింది. దటీజ్ ఎన్టీయార్.


మరింత సమాచారం తెలుసుకోండి: