మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం కలిగించాయో అందరికీ తెలిసిన విషయమే.. సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ఈ ఎన్నికలు జరిగాయి. రెండు ప్యానళ్ల సభ్యుల విమర్శలు, ప్రతివిమర్శలతో దాదాపుగా రెండు నెలలపాటు టీవీలన్నీ హీటెక్కిపోయాయి. ఒకరకంగా చెప్పాలంటే జనాన్ని ఎవరికి తోచిన మేర వారు.. సాధ్యమైనంత ఎంటర్టైన్ చేశారు. ఇలా జరిగిన 'మా' ఎన్నికల్లో అనూహ్యంగా ప్రకాష్ రాజ్ ప్యానల్ పై మంచు విష్ణు గెలుపొందాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఎన్నికలు పూర్తయినా ఆ సందడి మాత్రం ఇంకా తగ్గలేదు.

ఎన్నికల తర్వాత 'మా'కి పోటీగా 'ఆత్మ' వస్తుందనే ప్రచారం కూడా జరిగింది. ఈ వార్తలకు బలం చేకూర్చేలా.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచినవారు రాజీనామాలు చేశారు. ప్రకాష్ రాజ్, నాగబాబు ఏకంగా మా సభ్యత్వానికే రాజీనామాలు చేశారు. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. తాజాగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ సీసీ టీవీ ఫుటేజీ అడగటం, ఆ తర్వాత పోలీసులు ఆ ఫుటేజీని తమ స్వాధీనం చేసుకోవడం అందరికీ తెలిసిందే. అసలు 'మా' ఎన్నికల ముందు జరిగిన రచ్చకంటే, ఎన్నికల తర్వాత జరుగుతున్నదే బాగా ఎక్కువ అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో 'మా' లో గెలిచిన విష్ణు ప్యానెల్ హడావిడి కూడా ఏమాత్రం తగ్గలేదు. జైత్రయాత్రల్లాగా 'మా' సభ్యులంతా తెలుగు రాష్ట్రాల టూర్ ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

'మా' ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా మంచు విష్ణు.. తన సోదరితో కలిసి తిరుమల వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు రేణిగుంట ఎయిర్ పోర్ట్ వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ కూడా మీడియా సందడి చేసింది. మంచు లక్ష్మిని చుట్టుముట్టి ప్రశ్నలతో విసిగించేశారు. ఏదో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థిని అడిగినట్టు ప్రశ్నలమీద ప్రశ్నలు సంధించేశారు. వెయ్యిమంది ఓట్లు కూడా లేని మా ఎన్నికలను మీడియా కూడా బాగా హైప్ చేసింది. దానికి తగ్గట్టే విజేతలు కూడా ఇప్పుడు స్టేట్ మెంట్లిస్తున్నారు. ఈ స్టేట్ మెంట్లకు మళ్లీ బ్రేకింగ్ న్యూస్ నడుపుతూ హడావిడి చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ ప్రజలంతా మంచు విష్ణు గెలవాలని కోరుకున్నట్టు మంచు లక్ష్మి చెప్పడం మరో విశేషం. మా అధ్యక్షుడిగా ఎన్నికైన విష్ణు ప్రపంచాన్ని మార్చేస్తాడంటూ చెప్పిన మంచు లక్ష్మి ఇప్పుడు ఏకంగా తెలుగు రాష్ట్రాల ప్రజల మనోగతం ఇది అని చెప్పి అందరికీ షాకిచ్చారు.

ఇక మంచు విష్ణు కూడా పనిలో పనిగా మీడియాకు ఫీడ్ ఇచ్చేశారు. మా అధ్యక్షుడిగా తాను ఏం చేయబోతున్నానో ముందుముందు మీకే తెలుస్తుందని స్టేట్మెంట్ ఇచ్చేశారు. మరో మూడునెలల్లోనే నూతన 'మా' భవనం నిర్మించడానికి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. 'మా' ప్యానల్ లో ఉండే సభ్యులు అందరూ శ్రీవారి దర్శనానికి వచ్చామని చెప్పుకొచ్చారు. ఏదిఏమైనా మా అసోసియేషన్ ఎన్నికలు, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జనానికి మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. ఇప్పటికి ఇలా ఉంటే, ఇక తిరుమలలో కూడా ఈ ఎన్నికల విషయాలే చెబుతారేమో చూడాలి. ఏది ఏమైనా మా జైత్రయాత్ర ఆగలేదు.. అసలు ఆగేలా కనిపించడం లేదు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: