అలనాటి రోజులు మళ్లీ వస్తాయా అంటే ఆశావాదులు వస్తాయనే అంటారు. మనిషి ఆశగా ఎదురుచూడాల్సిందే. గతమెంతో ఘనం అని వర్తమానాన్ని కించపరచరాదు, భవిష్యత్తు బంగారం అని భావించి ముందుకు కదలాలి. ఇదంతా ఎందుకంటే అన్ని రంగాల్లో పెడ ధోరణలు పెరిగాయి కాబట్టి విశ్లేషించుకోవడం.

ప్రముఖ నాట్యకత్తె సంధ్యా రాజు అనే ఆమె ఉత్సాహం కొద్దీ నాట్యం పేరిట సినిమా తీశారు. రేవంత్ అనే నవ యువ దర్శకుడు దీనికి దర్శకత్వం వహించారు. నిజానికి ఈ కాలం ఏంటి, వస్తున్న సినిమాలు ఏంటి ప్రేక్షకుల అభిరుచి ఏంటి అని విశ్లేషించుకున్నపుడు కచ్చితంగా నాట్యం అన్న మూవీ రాకూడదు, అసలు అలాంటి ఆలోచనలు మెదడులో అలాగే పుట్టి అక్కడే ఉండిపోవాలి. కానీ సంధ్యా రాజు చాలా పెద్ద‌సాహసమే చేశారు. నాట్యం గురించి ఈ తరానికి తెలియచెప్పాలని  ఆమె తెగ తాపత్రయపడ్డారు. ఆమె ప్రయత్నానికి ఒక యువ దర్శకుడు కూడా తోడు కావడంతో ఈ నెల 22న నాట్యం అన్న మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

నాట్యం అన్న టైటిల్ లోనే ఎంతో లాలిత్యం ఉంది. క్లాసిక్ అన్న అర్ధం కూడా స్పురిస్తోంది. ఈ సినిమా గురించి తాజాగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుకున్నారు. అంతే కాదు, మరో శంకరాభరణం కావాలని కూడా ఆకాక్షించారు. నిజానికి శంకరాభరణం నాటి రోజులు ఇపుడు లేవు. ఆ మాటకు వస్తే శంకరాభరణం మూవీ టైమ్ లోనే అడవి రాముడు, డ్రైవర్ రాముడు అంటూ చాలా మాస్ మూవీస్ వచ్చాయి. అప్పటికే సినిమా కమర్షియల్ గా మరిన్ని కొత్త మెట్లు ఎక్కేసింది.

ఆ టైమ్ లో కళా తపస్వి విశ్వనాధ్ తపనతో తీసిన మూవీ శంకరాభరణం. ఆ మూవీని చూసిన వారు కూడా కొనడానికి ముందుకు రాలేదు. అలా చాన్నాళ్ళు లాబ్ లలో  మగ్గిన తరువాత ఎట్టకేలకు రిలీజ్ కి నోచుకుని మొత్తానికి సూపర్ హిట్ అయింది. అద్భుత కళాఖండం అయి టాలీవుడ్ కి తరగని కీర్తి అయింది. ఇపుడు నాట్యం అలాంటి క్లాసిక్ కావాలని మెగాస్టార్ కోరుకున్నారు. అందులో తప్పు లేదు. జనాలు ఏ తరం వారైనా వారిలో రసాస్వాదన మాత్రం ఎపుడూ మారదు, ఏది చూపిస్తే అదే చూస్తారు, మంచి మూవీ తీసి ముందు పెడితే ఆదరించే అవకాశాలు కూడా ఉంటాయేమో. ఏది ఏమైనా నాట్యం మూవీ మంచి ప్రయత్నం. అందరూ అభినందించాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: