మా ఎన్నికల వివాదం తాజాగా మరో మలుపు తిరిగింది. మా ఎన్నికల్లో వైసీపీకి చెందిన ఒక కార్యకర్త వీరంగం సృష్టించినట్టు ప్రకాష్ రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ కార్యకర్త జగ్గయ్యపేట కు చెందిన నూకల సాంబశివరావు గా గుర్తించారు. అంతే కాకుండా అత‌డిపై పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ ఉన్నట్టు కూడా గుర్తించారు. మా ఎన్నిక‌ల పోలింగ్ స‌మ‌యంలో సంబ‌శివ‌రావు ఎందుకు ఉన్నార‌ని ప్రకాష్ రాజ్ ప్ర‌శ్నిస్తున్నారు. రౌడీ షీటర్ సాంబ‌ శివరావు పోలింగ్ జ‌రుగుతున్న హాల్ లో ఉన్నట్టు ఆధారాలు కూడా ఉన్నాయని ప్ర‌కాష్ రాజ్ చెబుతున్నారు. అంతే కాకుండా సాంబశివరావు పోలింగ్ బూత్ వ‌ద్ద  ఓట‌ర్లను బెదిరించారని ప్రకాష్ ఆరోపిస్తున్నారు. మా ఎన్నిక‌ల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని... తక్షణమే చర్యలు తీసుకొని ఎన్నికలు అధికారి కృష్ణమోహన్ కు ప్రకాష్ రాజ్ లేఖ రాశారు. 

అంతే కాకుండా సాంబశివరావు మోహన్ బాబు.. విష్ణులతో కలిసి దిగిన ఫోటోలను కూడా ప్రకాష్ రాజ్ తన ఫిర్యాదులో జతపరిచారు. అయితే ఇప్పుడు నూకల సాంబశివరావు సినిమా పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేకుండా మా ఎన్నికల పోలింగ్ స‌మ‌యంలో ఎందుకు ఉన్నార‌ని అనుమానాలు మొదలవుతున్నాయి. మా ఎన్నికల్లో బయట వ్యక్తి ఎందుకు వచ్చాడు అని ప్రకాష్ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే మా ఎన్నిక‌ల పోలింగ్ జ‌రుగుతున్న స‌మయంలో మీడియా ను లోపలికి అనుమతించని సంగతి తెలిసిందే. దాంతో పోలిగ్ స‌మ‌యంలో లోపల ఏం జరిగిందన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది.

అయితే ప్రకాష్ రాజ్ మాత్రం ముందు నుండి మా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తునే ఉన్నారు. మోహ‌న్ బాబు త‌మ ప్యాన‌ల్ స‌భ్యుల‌ను బూతులు తిట్టార‌ని కొట్టార‌ని ప్ర‌కాష్ రాజ్ ఇప్ప‌టికే ఆర‌ప‌ణ‌లు చేశారు. మా ఎన్నికలు పూర్తయి విష్ణు గెలుపొందినా కూడా ప్రకాష్ రాజ్ తనకు అన్యాయం జరిగినట్టు ముందు నుంచి వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు పోలింగ్ కేంద్రం వ‌ద్ద వైసీపీ కార్యకర్త కు సంబంధించిన ఫోటోలు బయటకు రావడం సంచలనంగా మారింది. అయితే ఈ ఫిర్యాదు పై ఎన్నిక‌ల అధికారి ఎలాంటి సమాధానం ఇస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: