భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం సోమవారం  అట్టహాసంగా నిర్వ‌హించారు.  ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం జ‌రిగింది. ఇందుకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇటీవల సినీరంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతోపాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు.

ఇందులో  తెలుగు చిత్రాలకు ఐదు జాతీయ అవార్డులు దక్కాయి. జెర్సీకి రెండు, మహర్షికి మూడు అవార్డులు ద‌క్కాయి. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా జెర్సీ నిలిచింది. అదేవిధంగా జెర్సీ చిత్రానికి బెస్ట్ ఎడిటర్‌గా నవీన్‌ అవార్డు సాధించారు. జాతీయ అవార్డుల్లో ఎవరూ ఊహించని విధంగా మూడు  నేషనల్ అవార్డులను దక్కించుకుంది మహర్షి సినిమా.   తెలుగు భాషలో ఉత్తమ వినోదాత్మక చిత్రంగా జాతీయ అవార్డు సొంతం చేసుకుంది మహర్షి. అలాగే ఈ చిత్రాన్ని నిర్మించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌస్‌గా నేషనల్ అవార్డు గెలుచుకుంది. ఇక ఈ చిత్రానికి ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా రాజు సుందరం జాతీయ అవార్డు పొందారు.

జాతీయ ఉత్తమ నటిగా కంగనా రనౌత్ అవార్డు అందుకున్నారు. మణికర్ణిక చిత్రానికి కంగనా జాతీయ ఉత్తమ నటి అవార్డుకు ఎంపికయ్యారు. ఇక దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చిచోరే.. ఉత్తమ హిందీ చిత్రంగా అవార్డును అందుకున్న‌ది.  అసురన్‌ చిత్రంలో అద్భుత‌మైన నటనకు ధనుష్‌ జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం ద‌క్కించుకున్నాడు. సూపర్ డీలక్స్‌ చిత్రానికి  ఉత్తమ సహాయ నటుడు అవార్డు విజయ్‌సేతుపతికి దక్కింది. మలయాళం జల్లికట్టు సినిమాకు గాను బెస్ట్ సినిమాటోగ్రఫీగా గిరీష్ గంగాధరన్‌ అవార్డు  అందుకున్నారు.  బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ అవార్డును మలయాళం మూవీ మరక్కర్ ద‌క్కించుకున్నారు.

అదేవిధంగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు విశిష్ట పురస్కారం ల‌భించింది.  సినీ ఇండ‌స్ట్రీలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డు ఆయనకు వ‌రించింది. గత నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు ఆయన చేస్తోన్న సేవలు కేంద్రప్రభుత్వం గుర్తించి ఆయ‌న‌ను ఈ పురస్కారంతో గౌరవించింది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు  ర‌జినికాంత్‌కు అవార్డును అందజేశారు. మరోవైపు ఒకే యేటా  రజనీకాంత్‌, ఆయన అల్లుడు ధనుష్‌ అవార్డులు అందుకోవడం పట్ల సూపర్‌స్టార్‌ అభిమానులు సంతోషం  వ్యక్తం చేశారు


మరింత సమాచారం తెలుసుకోండి: