రజనీకాంత్. రీల్ పేరు ఇది. అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. పుట్టింది మహారాష్ట్ర. పెరిగింది కర్నాటక. హీరోగా వీరోచితంగా సత్తా చాటుకున్నది టోటల్ సౌతిండియాలో. రజనీ మేనియాలో కొన్ని దశాబ్దాలు వెండితెర పరవశించింది. రజనీ స్టైలే సెపరేట్. అసలు ఆయన రూటే గ్రేట్.

దటీజ్ రజనీ అని ఎన్ని సార్లు అనుకున్నారో ఫ్యాన్స్. ఇక కామన్ ఆడియన్స్ కూడా ఆయనంటే పూర్తిగా ఆరాధనా భావంతో ఉంటారు. ఒక సామాన్య బస్ కండక్టర్ తన నటనకు పదును పెట్టి ఈ రోజు భారత దేశం గర్వించే స్థాయికి చేరుకున్నాడు అంటే నిజంగా అది మామూలు విషయం కాదు, దాదా సాహెబ్ ఫాల్కే  అవార్డీగా అతి పెద్ద నట‌ దిగ్గజంగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో కొలువు తీరారు అంటే అదంతా ఆయన గొప్పతనం, కష్టమనే చెప్పాలి.

రజనీ 1975లో అపూర్వరాగంగల్ మూవీ ద్వారా దిగ్దర్శకుడు కె బాలచందర్ డిస్కవరీగా వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆ తరువాత ఏడాది అంటే 1976లో అంతులేని కధ మూవీ ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. రజనీ మొదట్లో చిన్న పాత్రలు వేసినా ఆ తరువాత ఎస్ కె ముత్తూరామన్ డైరెక్షన్ లో యాక్షన్ మూవీస్ చేస్తూ ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ సాధించారు. ఆయన 1980 దశకంలో మోస్ట్ వాంటింగ్ హీరోగా మారిపోయారు. ఇక తెలుగు, కోలీవుడ్ తో పాటు హిందీలో కూడా సత్తా చాటారు.

సరే రజనీ నటనకు ఎన్నో అవార్డులు వచ్చాయి. పద్మభూషణ్, పద్మ విభూషణ్. దాదాసాహెబ్ అవార్డ్ వంటివి ఆయనకు ఆభరణాలుగా మారాయి. భారత రత్న తప్ప అన్ని పౌర పురస్కారాలు రజనీ సొంతం కావడం అంటే అంతా ఆనందించాల్సిన విషయమే. రజనీ గ్రేట్ నెస్ ఏంటి అంటే కేవలం నటనేనా అంటే కానే కాదు, ఆయన మనిషిగానూ ఉన్నతుడు. ఇక ఆయనలో ఒక గొప్ప ఆధ్యాత్మికవాది ఉన్నారు. ఆయన ఈ రోజుకీ తాను ఎక్కడ నుంచి వచ్చానో మరచిపోలేదు. తాను ఎక్కి వచ్చిన మొదటి మెట్టుని గుర్తుపెట్టుకుని ఈ రోజుకీ అంతే వినయంతో ఉండడమే ఆయన గొప్పతనంగా చూడాలి. మొత్తానికి రజనీకాంత్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డీ అనే కంటే సంపూర్ణ నటుడు అనడం ఇంకా బాగుంటుందేమో.




మరింత సమాచారం తెలుసుకోండి: