గత రెండు వారాల నుండి అటు టీవీ లోనూ, సోషల్ మీడియాలోనూ, ప్రతి ఇంటిలోనూ, గ్రామాల అరుగుల మీద ఒక సినిమా గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. అంతలా ఏమిటి విషయం అని ఆరా తీస్తే అప్పుడు తెలిసింది అసలు కథ... తమిళ్ స్టార్ హీరో సూర్య లాయర్ గా నటించిన జై భీమ్ సినిమా గురించి అని, అయితే అందులో ఏముంది? సినిమాలు ఇంతకు ముందు చాలానే తీశాడు కదా అనుకుంటే పొరపాటే, ఈ సారి తీసిన సినిమా దేశమంతా పాకింది. ఒక అణగారిన షెడ్యూల్డ్ ట్రైబ్ కు చెందిన ఒక పాయింట్ ను తీసుకుని సినిమాగా మలిచాడు దర్శకుడు జ్ఞానవేల్.

ఈ నేరం చేయని ఒక ఎస్టీ కులానికి చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి నానా చిత్ర హింసలు పెడుతుంటారు. ఈ అన్యాయాన్ని అడగడానికి ఆ ముగ్గురిలో ఒకరు రాజన్న భార్య సిన్న తల్లి ముందుకు వచ్చి ప్రశ్నిస్తుంది. కానీ వారి అధికారం ముందు తన గొంతు  మూగబోయింది. అయినా వదలకుండా ఒక లాయర్ సహాయంతో కోర్టుకు వెళ్లి అందరినీ బయటకు లాగుతుంది. ఈ సందర్భంలో గర్భవతిగా ఉన్న సిన్న తల్లి నటనకు ఎన్ని మార్కులు వేసినా సరిపోవు. అంతలా నటనతో కేక పుట్టించింది. ఇక లాయర్ పాత్రలో చేసిన సూర్య గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలా ఈ సినిమా ప్రతి ఒక్కరి మనసుకు చేరువైంది.

అయితే ఇది తమిళ్ దర్శకుడు చేసిన సినిమా, ఇదే కాదు వీరు చేసే సినిమాలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. మనుషుల జీవితాలను ప్రతిబింబించేలా చిత్రీకరిస్తారు. కానీ  టాలీవుడ్ పేరిట పెద్ద పరిశ్రమ మనకు ఉంది. కానీ ఇలాంటి సినిమాలు ఇక్కడ ఎందుకు రావట్లేదు. పెద్ద పెద్ద దర్శకులు ఇలాంటి వాటిపై ఎందుకు ఆసక్తి చూపడం లేదు. ఇక్కడ మనకున్న దర్శక నిర్మాతలకు పెద్ద సినిమాలు తీయాలి, అందులో కోట్లు సంపాదించాలి అనే ఉంటుంది అంతే కానీ సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సినిమాలను తీయలేరని మీడియా అంతా దుమ్మెత్తిపోస్తోంది. ఇకనైనా తెలుగులోనూ ఇలాంటి సినిమాలు వస్తాయని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: