కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ప్రారంభించిన సేవా యజ్ఞాన్ని తాను కొనసాగిస్తానని నటుడు విశాల్ అన్నాడు. పునీత్ చదివించిన 1800మంది విద్యార్థుల బాధ్యతను తీసుకుంటున్నాని.. అందుకు తాను ఇల్లు కొనడానికి జమ చేస్తున్న డబ్బును వినియోగిస్తానని చెప్పాడు. తన కోరికల కంటే విద్యార్థుల చదువే ప్రధానమని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన సంతాప కార్యక్రమంలో విశాల్ పేర్కొన్నాడు.

మరోవైపు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సంస్మరణ సభలో తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ భావోద్వేగానికి గురయ్యాడు. పునీత్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని కన్నీరు పెట్టుకున్నాడు. తన శ్రద్ధాంజలికి పునీత్ వస్తాడనుకున్నాననీ.. కానీ ఇప్పుడు తానే రావాల్సి వచ్చిందన్నాడు. ఆ దేవుడు పునీత్ బదులు తనను తీసుకెళ్లినా బాగుండంటూ తీవ్ర భావోద్వేగంతో కన్నీరుమున్నీరయ్యడు.

మరోవైపు పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న అవార్డు ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటక రాష్ట్రానికే అత్యున్నత పురస్కారమైన ఈ అవార్డును పునీత్ కు ఇచ్చేందుకు ఏకగ్రీవ తీర్మానం చేశామని సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. ఈ గౌరవం దక్కిన 10వ వ్యక్తి పునీత్. అంతకుముందు 2009లో వీరేంద్ర హెగ్గడేకు వరించింది. అటు 46ఏళ్ల పునీత్ అక్టోబర్ 29న గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు.

పునీత్ మరణాన్ని సినీ ఇండస్ట్రీనే కాదు.. ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నారు. కొందరైతే ఇప్పటికే గుండె ఆగి మరణించిన వారూ ఉన్నారు. అభిమాన లోకం బరువెక్కిన గుండెలతో ఉంది. ఆయన సేవలను స్మరించుకుంటోంది. అటు అభిమానులే కాదు.. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పునీత్ ను తలుచుకుంటున్నారు. పునీత్ ఒక గొప్ప వ్యక్తి.. ఆయన ఎక్కడికో వెళ్లలేదు.. మన మధ్యలోనే ఉన్నారంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.







మరింత సమాచారం తెలుసుకోండి: