ఎవరు ఊహించని విధంగా బాలకృష్ణ ఒక టాక్ షోను హోస్ట్ చేయడం ఒక సంచలనం అయితే ఆ టాక్ షో ‘అన్ ష్టాపబుల్’ అందరికీ విపరీతంగా నచ్చేయడం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. వాస్తవానికి బాలయ్య చాల మూడీ గా ఉంటాడని చిన్న విషయానికే కోపం తెచ్చుకుంటూ మరీ కోపం పెరిగిపోతే తన అభిమానులను కూడ లెక్క చేయకుండా లెంపకాయలు కొడతాడని అనేక సంఘటనలు గతంలో రుజువు చేసాయి.


బాలయ్య ముక్కోపి అన్న ప్రచారం ఏనాటినుంచో జరిగింది. అయితే ఈ ఇమేజ్ ని ‘అన్ ష్టాపబుల్’ షో పూర్తిగా తుడిచి వేసింది. అంతేకాదు ఎవరు ఊహించని విధంగా బాలకృష్ణ ను నేటితరం యూత్ కు ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఇప్పటివరకు బాలయ్య సినిమాలు అంటే పక్కా మాస్ సినిమాలు అన్న ఇమేజ్ ఉంది. దీనికి తగ్గట్టుగా బాలకృష్ణ కు సూపర్ హిట్స్ ఇచ్చిన చాల సినిమాలు మాస్ సినిమాలు.


వాస్తవానికి బాలకృష్ణ తొలిరోజులలో నటించిన ‘మంగమ్మగారి మనవడు’ సినిమా ఘనవిజయం సాధించడంతో అప్పట్లో బాలయ్య ఫ్యామిలీ ప్రేక్షకులకు అభిమాన హీరో. అయితే ‘సమరసింహా రెడ్డి’ తరువాత బాలయ్య ఇమేజ్ పూర్తిగా మారిపోయి మాస్ హీరోగా మారిపోవడంతో బాలయ్య నుండి ఫ్యామిలీ ప్రేక్షకులు దూరం అయ్యారు. ఇప్పుడు అలా దూరమైన ఆ ప్రేక్షకుల వర్గాన్ని ఆహా లో ప్రసారం అవుతున్న ‘అన్ ష్టాపబుల్’ తిరిగి దగ్గరకు చేరుస్తోందా అన్న సందేహాలు వస్తున్నాయి.


ఈ షోకి సంబంధించి ఇప్పటి వరకు స్ట్రీమ్ అయిన ఎపిసోడ్స్ లో బాలయ్య లుక్ లో అదేవిధంగా అతడి బాడీ లాంగ్వేజ్ లో వచ్చిన మార్పులను చూసి నేటితరం ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు చాలామంది అభిమానులుగా కూడ మారుతున్నారు. ఈ మారిన పరిస్థితులలో వచ్చేనెల విడుదల అవుతున్న ‘అఖండ’ కు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఆ మూవీ రికార్డులు సృష్టించడం ఖాయం అన్న మాటలు వినిపిస్తున్నాయి..  





మరింత సమాచారం తెలుసుకోండి: