గత కొద్ది రోజులుగా దేశంలో పలు చోట్ల తుఫాను ధాటికి జనాలు గజగజ వణికిపోతున్నారు. సంవత్సరం అంతటా ప్రపంచం నుండి వచ్చే భక్తులతో కితకితలాడే తిరుపతి, కరోనా లాంటి కడు కష్ట కాలం తరవాత మళ్లీ ఈ భయంకర వర్షాల కారణంగా జనాలు లేక వెలవెలబోతోంది. మునుపెన్నడూ లేని విధంగా చిత్తూరు జిల్లాలో వర్షాలు ఏకధాటిగా కురవడంతో ఎక్కడికక్కడ వరద నీరు నిండిపోయి మహా సముద్రాలను తలపిస్తూ జనజీవనానికి అడ్డంకిగా మారింది. ఒక్క చిత్తూరు జిల్లాలోనే కాకుండా మొత్తం రాయలసీమ జిల్లాల్లోనూ పెను వర్షాలతో భీభత్సాన్ని సృష్టించింది. అయితే ఇంతటి కష్ట సమయంలో ఒకరికొకరు సహాయం ఎంతో అవసరం.

ముఖ్యంగా ప్రభుత్వాలు, సినీ ప్రముఖులు, సేవ సంస్థలు ముందుండి ప్రజలను ఆదుకోవాల్సిన విపత్కర సమయం. ప్రభుత్వం సంగతి అటుంచితే సినీ పరిశ్రమ నుండి ఈ వర్షాలతో అల్లాడుతున్న ప్రజలకు సాయం అందించే నాదుడే కనిపించడం లేదు. అరకొర సాయాలు మాత్రం కనిపిస్తున్నాయి. కానీ అత్యవసరం ఉన్నంత మేరలో సాయం అందక జనాలు విలవిలలాడుతున్నారు. నేడు సినీతారలు ప్రేక్షక పాత్ర పోషిస్తూ వరదల ధాటికి అల్లుడుతున్న ప్రజల కష్టాలను చూస్తున్నారు తప్ప ముందుకొచ్చి సాయం చేయడం లేదు. ప్రజలు మాత్రం వరుస భారీ వర్షాలతో సినిమా కష్టాలు అనుభవిస్తున్నారు.

సినిమా ముందొకసారి, సినిమా హిట్ అయ్యాక మరోసారి తిరుపతిలో ఏడుకొండల స్వామిని దర్శించుకుని ముడుపులు చెల్లించే సినీ తారలు నేడు వర్షాల కారణంగా సమస్యల్లో చిక్కుకున్న అదే తిరుపతి  ప్రజలకు సాయం అందించాలని అనుకోవడం లేదు. ఆ వేంకటేశుని భక్తులు అయినా ఎంతోమంది హీరోలు, నిర్మాతలు, దర్శకులు సినిమా స్టార్ట్ అయినా, పూర్తి అయినా, సక్సెస్ అయినా ఇలా ఏ సందర్భం అయినా ఇక్కడకు వచ్చి స్వామి వారిని దర్శించుకుని వెళుతూ ఉంటారు. కానీ ఆ తిరుమలేశుడు కొలువైన ప్రదేశం వర్షాలతో అట్టుడుకుతుంటే ఆదుకునే వారే కరువయ్యారు. ఇదేనా దేవుని యందు ఉండే విశ్వాసం, ఇకనైనా కళ్ళు తెరవండి వర్షాల ద్వారా ఆవాసాలు కోల్పోయిన వారిని ఆదుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: