గత కొన్ని రోజులుగా ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కడప, చిత్తూరు, నెల్లూరు వంటి జిల్లాల్లో జనాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కాస్త వర్షాలు తగ్గు ముఖం పట్టినప్పటికీ పలు కాలనీలు, ప్రాంతాలు జల దిగ్భంలోనే ఉండటం గమనార్హం. మరో రెండు రోజుల్లో మళ్ళీ భారీ తుఫాను అన్న వార్తలు వారిని మరింత కలవరపెడుతున్నాయి. వరుస సినిమాలు తీసి వాటి ప్రమోషన్స్ కోసం పలు జిల్లాలో ప్రత్యేకంగా ప్రోగ్రామ్ లు పెట్టి జనాలను పలకరించే సినీ తారలు నేడు భారీ వర్షాలతో వణికిపోతున్న ప్రజల గోడును వినేందుకు కూడా కనుచూపు మేరలో కనిపించడం లేదు.

ఈ భయంకర వర్షాల తాకిడికి కట్టుకోడానికి గుడ్డ, నిలువడానికి నీడ, తినడానికి గుప్పెడు అన్నం కూడా దొరకని జనాలు ఎందరో వరదల్లో ఇళ్లను పోగొట్టుకుని పిల్లా జల్లను వెంటేసుకుని ఎక్కడికి వెళ్ళాలో దిక్కు తోచని దయనీయ స్థితిలో అలమటిస్తున్నారు. ఈ కుండపోత వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అట్టుడికి పోతోంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం వానగండానికి చెల్లా చెదురయ్యింది. అక్కడి పలు ప్రాంతాల్లో ప్రజలు కుంభ వర్షాలకు నిస్సహాయులుగా మారారు.
రాయలసీమ ఫ్యాక్షనిజం పై, సీమ యాసతో చిత్రాలు తీసి భారీ విజయాలను అందుకున్న చిత్రాలెన్నో, వాటి ద్వారా ఇండస్ట్రీలో నిలబడిన వారెందరో...కానీ నేడు అదే రాయలసీమలో భారీ వర్షాలకు గ్రామాలు కొట్టుకుపోతున్న సినీ సెలబ్రిటీలు ఒక్కరూ ముందుకు రావడం లేదు.

ఆ ఆలోచన ఉన్నట్లు కూడా ఎక్కడ  వినిపించడం లేదు. ఎవరి వల్ల అయితే నేడు ఈ స్థాయిలో ఉన్నామో వారే నేడు కష్టాలతో తొణికిసలాడుతుంటే వీలైనంతలో సాయం చేసి ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్న వారే ఇలా వేడుక చూస్తుంటే...ఇంకేమి చేయాలి. ఇప్పటికే మీడియాలో వీరిని ఆదుకోవాలని శరణార్థులు ఎక్కువవుతున్న సమయంలో కళ్ళు తెరిచి సాయం చేయడానికి ముందుకు రావాలని అంతా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: