‘సినిమా టికెట్ల ధరలు పెంచితే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. టికెట్ల ధరలు పెంచితే కొనేవాళ్ళు కొంటారు మధ్యలో ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమిటి’ ? తాజాగా వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రభుత్వానికి వేసిన సూటి ప్రశ్న. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. లాభాల కోసమని వ్యాపారులు ధరలు పెంచేస్తారు. మరపుడు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, ధరలను తగ్గించాలని ఎందుకు గోల చేస్తారు ? ధరలు పెరుగుతున్నపుడు నిత్యావసరాలైనా, సినిమా టికెట్లయినా జోక్యం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది.

ఆన్ లైన్లో సినిమా టికెట్లను అమ్మాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. దీనిపై పరిశ్రమలో మిశ్రమ స్పందనుంది. నిజానికి ఆన్ లైన్లో టికెట్లను అమ్మితే దర్శకులకు కానీ, నిర్మాతలకు కానీ, ఎగ్జిబిటర్లకు కూడా నష్టమేమీలేదు. పైగా లాభపడితే మామూలు జనాలే. సినిమాల విడుదల సందర్భంగా ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు టికెట్ల ధరలను పెంచకుండా ప్రభుత్వం జోక్యం చేసుకుంటోంది. ఆన్ లైన్లో టికెట్లను అమ్మాలని పరిశ్రమ వర్గాలే 20 ఏళ్ళుగా ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నది.

సినిమా టికెట్లను ఆన్ లైన్లో అమ్మితే నష్టం ఎవరకయ్యా అంటే రు. 40-50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న పెద్ద హీరోలకు మాత్రమే. అంటే చాలాకొద్దిమందికి మాత్రమే ఎదురయ్యే ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని తిరుగుబాటు ఎంపీ ప్రభుత్వంపై నోటొకిచ్చింది మాట్లాడుతున్నారు. ఆన్ లైన్లో టికెట్లు అమ్మకం వల్ల  టికెట్లు కొని సినిమా చూసే మామూలు జనాలకు ఉపయోగం. అడ్డుగోలు దోపిడికి అడ్డుకట్ట పడినట్లవుతుందని జనాలు సంతోషిస్తుంటే ఎంపీ మాత్రం ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు.

ఇక్కడ సమస్య ఏమన్నా ఉంటే పరిశ్రమవర్గాలు ప్రభుత్వం కూర్చుని మాట్లాడుకుంటాయి. మధ్యలో ఎంపీకి వచ్చిన నొప్పేంటో అర్ధం కావటంలేదు. ఎగ్జిబిటర్లు, దర్శక, నిర్మాతల్లో ప్రభుత్వం నిర్ణయంపై సానుకూలత కనబడుతోంది. నిజానికి ఆన్ లైన్లో టికెట్ల వ్యవహారంతో పరిశ్రమలోని చాలామందికి ఎలాంటి సంబంధంలేదు. ఎవరి రెమ్యునరేషన్ వాళ్ళు తీసుకుని సినిమాకు పనిచేస్తారు కాబట్టి టికెట్లను ఏ పద్దతిలో అమ్ముకుంటున్నా వాళ్ళకు వచ్చే నష్టమేమీ లేదు. బ్లాకులో టికెట్ల అమ్మకం తగ్గిపోతే నష్టపోయేది ఎగ్జిబిటర్లు.

పరిశ్రమలోని కొందరు నిర్మాతలే బ్లాకులో టికెట్లను అమ్మిస్తున్నారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. నిర్మాతల్లో కేవలం ముగ్గు, నలుగురు మాత్రమే థియేటర్లను తమ గుప్పిట్లో ఉంచుకుని టికెట్లను బ్లాకుల్లో అమ్మిస్తున్నారనే ఆరోపణలున్నాయి. బహుశా అలాంటివారికి ఆన్ లైన్లో టికెట్ల అమ్మకం వల్ల ఇబ్బందులుండవచ్చు. ప్రభుత్వ నిర్ణయం వల్ల అంతిమంగా మామూలు జనాలకు లాభమా నష్టమా అని చూసుకుంటే లాభమనే అనుకోవాలి. మరి మామూలు జనాల కోసమని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మధ్యలో ఎంపీకి వచ్చిన సమస్యేంటో అర్ధం కావటంలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: