దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి మేగ్న‌మ్ ఓప‌స్ మూవీ ఆర్.ఆర్‌.ఆర్ లోని జ‌న‌నీ సాంగ్ తాజాగా విడుద‌ల అయింది. ఎప్ప‌డెప్పుడు ఈ పాట‌ను చూద్దాం అని ఎదురుచూస్తున్న ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌తేజ అభిమానుల దాహార్థిని ఈ పాట తీర్చేసింది. విడుదలైన కొద్ది సేప‌టికే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డం మొద‌లెట్టింది జ‌న‌నీ సాంగ్‌. 2022 జ‌న‌వ‌రి 07న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఐదు భాష‌ల‌లో విడుద‌ల కాబోతున్న ఆర్ఆర్ఆర్ జ‌న‌నీ గీతాన్ని సైతం ఐదు భాష‌ల్లో రాజ‌మౌళి విడుద‌ల చేసారు. ఎం.ఎం.కీర‌వాణి స్వ‌ర‌ప‌రిచి, స్వ‌యంగా పాట‌డంతో పాటు ఈ గీతానికి ర‌చ‌న కూడా చేసారు. ఆర్.ఆర్‌.ఆర్‌. సినిమా రీ-రికార్డింగ్ చేసే క్ర‌మంలో దాని ఆత్మ‌ను ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసారు కీర‌వాణి. ముఖ్యంగా సినిమాలో కోర్ పాయింట్ గుర్తించి దానిని పాట రూపంలో మ‌లిచిన‌ట్టు తెలిపారు కీర‌వాణి.  

జ‌న‌నీ ప్రియ‌భార‌త జ‌న‌నీ అంటూ సాగే ఈ గీతం మ‌న‌దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏండ్లు గ‌డిచిన సంద‌ర్భంగా జ‌రుగుతున్న అమృత ఉత్స‌వానికి ఇది నివాళిలా అనిపిస్తోంది. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ తో పాటు ఆలియా భ‌ట్ సైతం ఈ పాట‌లో క‌నిపించారు. అదేవిధంగా అజ‌య్‌దేవ‌గ‌ణ్‌, ఆయ‌న భార్య‌గా శ్రియా మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌ల‌కు కూడా చోటు ఇచ్చారు రాజ‌మౌళి. స్టార్స్ ద‌గ్గ‌ర నుంచి బాల‌న‌టులు, జూనియ‌ర్ ఆర్టీస్టులు సైతం ఇందులోని ప్ర‌తి సన్నివేశానికి ప్రాణం పెట్టి చేసార‌ని ఈ పాట చిత్రీక‌ర‌ణ చూస్తే ఇట్టే అర్థ‌మవుతోంది.

'జననీ.. ప్రియ భారత జననీ..’ అనే పాట ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకి ఆత్మలాంటిదని ఇప్ప‌టికే ఎస్‌ఎస్ రాజమౌళి వెల్ల‌డించారు.  ఈ పాట కోసం పెద్దన్న కీరవాణి దాదాపు రెండు నెలలు శ్రమించారని వివ‌రించారు. ఆయనే ఈ పాటకు లిరిక్స్ రాయ‌డ‌మే కాకుండా.. ఈ పాటను ఒక్కరోజు ముందుగా గురువారం హైదరాబాద్‌లో విలేకరుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. రాజమౌళి ‘‘డిసెంబర్‌ మొదటి వారంలో ట్రైలర్‌ విడుదల చేస్తామ‌ని చెప్పారు.  వరుసగా ప్రీ రిలీజ్‌ వేడుకలు ఏర్పాట్లు చేస్తున్నాం అని.. ‘జనని..’ పాటలో కనిపించని భావోద్వేగాలుంటాయని,  ఒక మణిహారంలో ఉన్న దారం ఎలాగైతే కనిపించదో.. అలానే సాఫ్ట్‌ ఎమోషన్‌ కనిపించదు అన్నారు.  కానీ సినిమా సోల్‌ మొత్తం ఆ పాటలోని భావోద్వేగంలోనే దాగి ఉంటుంది  అని  వివ‌రించారు రాజ‌మౌళి. పాటలో పేర్కొన్నట్టుగా అరినాశ గర్జనములై… ఈ సినిమా అఖండ విజయం సాధించడం ఖాయమని ఈ పాట చూస్తే అర్థమ‌వుతోంది. ఇంత‌కు ముందు వచ్చిన ‘నాటు నాటు’ సాంగ్ తో కుర్రకారుని కిక్కెక్కించిన రాజమౌళి, ‘జననీ’ గీతంతో ప్రతి ఒక్కరి హృదయాలను ఆర్ద్రతతో నింపేసాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: